సిరిసిల్ల బరిలో బీజేపి మహిళ నేత రాణి రుద్రమ?

సిరిసిల్ల బరిలో బీజేపి మహిళ నేత రాణి రుద్రమ?
  • మంత్రి కేటీఆర్ పై పోటీలో నిలిపేందుకు బీజేపి ఆలోచనలు
  • సిరిసిల్ల నేత లగిశెట్టి శ్రీనివాస్ తో పాటు రాణి రుద్రమ పేరు
  • రాజన్నసిరిసిల్ల జిల్లా లో బీజేపి టికెట్ పై కొనసాగుతున్న చర్చ
  • లగిశెట్టి శ్రీనివాస్కు బీజేపి టికెట్దక్కేనా..?

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో బీజేపి పార్టీ తరుపున బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి, సిరిసిల్ల ప్రచారక్ రాణి రుద్రమను బరిలో ఉంచేందుకు ఆలోచన చేస్తుంది. సిరిసిల్ల చెందిన పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ బీజేపి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ తరునంలో బీజేపి అధిష్టానం మహిళ కోటలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమను బరిలో ఉంచితే బాగుంటుందని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపి అధిష్టానం నుంచి రాణి రుద్రమకు సమాచారం అందడంతో పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైన బరిలో ఉంటానని.. బీజేపి గెలుపుకు కృషి చేస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ నేఫధ్యంలో రాణి రుద్రమ సిరిసిల్ల లో పలువురికి ఫోన్ చేసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది... బీజేపి క్యాడర్ ఎంత వరకు సపోర్ట్ చేస్తారు.. పద్మశాలీ ఓటు బ్యాంకును సంపాదించాలంటే ఎవరెవరిని కలవాలి.. ఏం ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.. మంత్రి కేటీఆర్ను ఢీకొట్టాలంటే ఏయే కార్యక్రమాలు.. ఏ విధంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రచార అస్త్రాలను ఎక్కుపెట్టాలి అనే అంశంపై రాణి రుద్రమ అడుగుతున్నట్లు తెలిసింది. తాను మాత్రం సిరిసిల్ల టికెట్టు అడగలేదని.. పార్టీ ఆదేశిస్తే మాత్రం బరిలో ఉంటానని.. రాణి రుద్రమ ప్రకటించారు. సిరిసిల్ల లో బీజేపి గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలిపారు.పార్టీ ఏ బాధ్యత అప్పగించిన స్వీకరిస్తానని రాణి రుద్రమ బీజేపి అధినాయకత్వానికి వెల్లడించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా సిరిసిల్ల పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్కే బీజేపి టికెట్ ఇవ్వాలని.. ఇస్తేనే బీజేపికి ఓట్లు పడుతాయని సిరిసిల్ల బీజేపి శ్రేణులు సోషల్ మీడియాలో వెల్లడించారు. రాణి రుద్రమకు ఇప్పటికిప్పుడు టికెట్ ఇస్తే లాభం కంటే నష్టం ఎక్కువని పేర్కొంటున్నారు.