పదవ తరగతి పరీక్షా కేంద్రాల పరిసరాల్లో కఠినంగా 144 సెక్షన్ అమలు చేయాలి- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

పదవ తరగతి పరీక్షా కేంద్రాల పరిసరాల్లో కఠినంగా 144 సెక్షన్ అమలు చేయాలి- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

ముద్ర సిరిసిల్ల టౌన్; తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లతో మంగళ వారం రాత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత రెండు రోజులుగా పదవ తరగతి ప్రశ్నా పత్రాలు లీకేజీ కావడం పట్ల కలెక్టర్ లు, పోలీస్ కమిషనర్, ఎస్పీలు అప్రమత్తం కావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో అత్యంత కఠినంగా 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా కేంద్రాల లోపలికి ఎవరికి సెల్ ఫోన్ లను అనుమతించరాదని, జిల్లా కలెక్టర్ లు, తహసిల్దార్ లు సైతం సెల్ ఫోన్ తీసుకోని వెళ్ళవద్దని తెలిపారు. జవాబు పత్రాల రవాణా సమయంలో స్థానిక పోస్టల్ అధికారులకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. మిగిలిన పరీక్షలు సజావుగా జరిగే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో అదనపు పెట్రోలింగ్ చేయాలని, క్షేత్రస్థాయి వరకు ఎక్కడా అలసత్వం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యాధికారి ఎ. రమేష్ కుమార్, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అసిస్టెంట్ కమీషనర్ అజీమ్, తదితరులు పాల్గొన్నారు