జూన్ 4 5 6 తేదీల్లో రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు

జూన్ 4 5 6 తేదీల్లో రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు

జూన్ 4న నర్సంపేటలో ఎంసిపిఐ(యు) భారీ ప్రదర్శన-బహిరంగ సభ .

సూర్యాపేట పట్టణంలో నీ భీమిరెడ్డి విగ్రహం దగ్గర బహిరంగసభ పోస్టర్ ఆవిష్కరించిన నాయకులు.

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట : రాష్ట్రంలో వర్గ సామాజిక జమిలి పోరాటాలను విస్తృతపరిచేందుకే ఎంసిపిఐ(యు) రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జూన్ 4 5 6 తేదీల్లో నర్సంపేటలో జరుగుతున్నాయని ఎంసిపిఐ(యు) కేంద్ర కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్న పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ నజీర్  తెలిపారు. జూన్ 4న నర్సంపేట పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి పాత రామ్ రాజ్ టాకీస్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు దీనికి ముఖ్య అతిథులుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్ది కాయల అశోక్ ఓంకార్ కేరళ ప్యానల్ స్పీకర్, ఎమ్మెల్యే కామ్రేడ్ కేకే రేమా పాల్గొంటారని తెలిపారు.  గురువారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  
జూన్ 4న జరగబోయే బహిరంగ సభ ప్రదర్శన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర పాలకుల విధానాల మూలంగా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు కనీస అవసరాలు తీర్చుకోలేని పేదల సంఖ్య దారుణంగా పెరిగిందని ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే కొత్త కొత్త హామీలతో ప్రజలను మభ్యపెట్టి మళ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకొని అధికారాన్ని కాపాడుకోవాలని మతోన్మాద బీజేపీ నియంతృత్వ బిఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టి రాష్ట్ర ఖజానా నింపుకోవాలని చూడటం కేసీఆర్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఢిల్లీ నగరంలో మహిళ క్రీడాకారులపై జరుగుతున్న లైంగిక వేధింపులను నిరసిస్తూ రెజ్లర్లు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న పట్టించుకోని మోడీ ప్రభుత్వం ప్రజలకు ఏం న్యాయం చేసిందని ప్రశ్నించారు .

కేంద్రంలో పార్లమెంటు రాష్ట్రంలో సచివాలయం నూతన భవనాలను నిర్మించిన పాలకులు పేదోడికి మాత్రం నిలువ నీడ కల్పించలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వామపక్ష సామాజిక కమ్యూనిస్టులు ఐక్యతను బలోపేతం చేసుకుంటూ ప్రజా పోరాటాలను ఉదృతం చేయడానికి పార్టీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు చర్చిస్తాయని అన్నారు. ఈ సందర్బంగా జూన్ 4న జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభలను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు శివరాత్రి రాములు మన్నెమ్మ  లక్ష్మమ్మ వెంకటమ్మ శబరి డానియల్ తదితరులు పాల్గొన్నారు.