వాగ్దానాల దగా దశాబ్ది వేడుకలతో ఒరిగిందేమిటి?

వాగ్దానాల దగా దశాబ్ది వేడుకలతో ఒరిగిందేమిటి?
  • సోనియా లేకుంటే రాష్ట్రం వచ్చేదా?
  • కాంగ్రెస్ నేత శ్రీహరి రావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:వేలాది మంది బలిదానాలు, పార్టీకి నష్టం అని తెలిసినా సోనియా చేసిన త్యాగం లేకుంటే తెలంగాణా వచ్చేదా? అని కాంగ్రెస్ నేత కూచాడి శ్రీహరి రావు ప్రశ్నించారు. బలిదానాల తెలంగాణా నేడు దగా పడ్డ తెలంగాణ అయిందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు గురువారం ' దశాబ్ది దగా ' నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీహరి రావు మాట్లాడుతూ దగా, బూటకపు హామీల మీద ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరిట అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యం అమ్ముకునేందుకు కూడా తిప్పలు పడ్డారన్నారు. అవినీతే ఎజెండాగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. ఎవరో ఒకరు పార్టీని వీడితే బలహీనపడే చరిత్ర కాంగ్రెస్ కు లేదన్నారు. త్యాగాల పునాదుల మీద సాకారమైన తెలంగాణా రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. బిజెపి కేంద్రంలో, బీ ఆర్ ఎస్ రాష్ట్రంలో పాలించే అర్హత పోగొట్టుకున్నాయన్నారు. దళిత బంధు, రైతుబంధు అన్నీ అవినీతిమయం ఐనాయన్నారు. రాష్ట్ర మంత్రులు కేవలం తమ గ్రామాల అభివృద్దే రాష్ట్రాభివృద్ధి గా వ్యవహరిస్తున్నారన్నారు. పదేళ్లు పూర్తి కాకపోయినా దశాబ్ది వేడుకల పేరుతో ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు చేస్తున్న యత్నాలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు నిర్మల్ లోని ప్రధాన వీధుల గుండా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, అర్జుమన్, వాజిద్, పొడెల్లి గణేష్, గాజుల రవి కుమార్, నాందేడపు చిన్ను తదితర నేతలతో పాటు అనుచరులు, ప్రజలు పాల్గొన్నారు.