రావి పహాడ్ గ్రామంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పై సమగ్ర విచారణ చేపట్టాలి

రావి పహాడ్ గ్రామంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పై సమగ్ర విచారణ చేపట్టాలి

 తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు డిమాండ్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: మోతే మండలం ఉమ్మడి రావి పహాడ్ గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి  అర్హులైన పేదలకు న్యాయం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్  ముందు  ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోతే మండల పరిధిలోని ఉమ్మడి రావి పహాడ్ గ్రామపంచాయతీలో నిర్మించిన 40 డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక లో పారదర్శకత లోపించిందన్నారు.  దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాకాకుండా వ్యవసాయ భూములు ,ఇండ్ల స్థలాలు, గతంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు, ఆర్థికంగా ఉన్నవారికి ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇల్లు కేటాయించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలను తుంగలోకి తొక్కి అధికారులు, గ్రామ ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక లో అనహర్హులకు చోటు కల్పించారని విమర్శించారు.

ఈ విషయమై అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే అధికారులు గ్రామంలో  సమగ్ర విచారణ చేపట్టి అనహర్హులను తొలగించి వారి స్థానంలో అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని  పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ పటేల్ కు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సోమ గాని మల్లయ్య, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు వెలుగు మధు చేగువేరా, బిఆర్ఎస్ గ్రామ నాయకులు పోడ పంగి రమేష్ ,కాంగ్రెస్ గ్రామ నాయకులు పొడ పంగి ప్రభాకర్ ,నాయకులు సండ్ర మధు ,కాంపాటి దిలీప్ కుమార్, మంద రవి, ఇట్ట మల్ల సుగుణమ్మ, చాట్ల నాగమణి, ఎల్లుట్ల ఉప్పలమ్మ, పొడ పంగి వెంకమ్మ, కొండ రమణ, నిమ్మల పద్మ ,పెరుమాండ్ల నాగమణి, పానగంటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.