కొండగట్టుకు మూడు వేల ఎకరాలు కేటాయించాలి

కొండగట్టుకు మూడు వేల ఎకరాలు కేటాయించాలి
  • మే 6న  "రామనామ మహా యజ్ఞం"
  • పంట నష్టానికి కారణం కేసీఆర్
  • రైతులకు ధీమా కలిగించే బీమా పథకం ఏది ?
  • కిసాన్ మోర్చా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టు దేవస్థానానికి మూడు వేల ఎకరాల స్థలం కేటాయించాలని కొండగట్టు దేవస్థానం పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, కిసాన్ మోర్చా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు డిమాండ్ చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొండగట్టు పరిసర ప్రాంతంలో 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమి, వెయ్యి ఎకరాల అటవీ శాఖ భూమి అందుబాటులో ఉందని వెల్లడించారు. దీని నుండి కేవలం 237 ఎకరాలు కొండగట్టు దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సంపూర్ణ ప్రకృతి వనరులు కలిగిన ఏకైక ఆధ్యాత్మిక క్షేత్రం కొండగట్టు అని, తెలంగాణలోనే గొప్ప పర్యాటక క్షేత్రంగా విలసిల్లే ప్రకృతి రమణీయ సోయగం ఉన్న దివ్య క్షేత్రం కొండగట్టు అన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన కొండగట్టు క్షేత్రానికి 237 ఎకరాల కేటాయింపు సరిపోదన్నారు. మిగతా ప్రభుత్వ భూమి భూమాఫియా చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  కొండగట్టు పరిరక్షణ సమితి పోరాట సమితి ఆధ్వర్యంలో మహా సుదర్శన యాగం ఫలితమే నిధుల మంజూరు, భూ కేటాయింపులని స్పష్టం చేశారు. కొండగట్టు అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా భూకబ్జాలు జరగకుండా ఉండాలని మే 6 న ఉదయం 6 నుండి 9 గంటల వరకు "రామనామ మహా యజ్ఞం" నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత తరచూ కొండగట్టు క్షేత్రాన్ని సందర్శిస్తూ ఆలయ అభివృద్ధిని పొలిటికల్ స్టంట్ గా మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

కెసిఆర్ వల్లే రైతులకు పంట నష్టం :
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రైతులకు పంట నష్టం జరిగిందని సుగుణాకర్ రావు మండిపడ్డారు. అకాల వర్షాలతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన టైంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతోనే పంట నష్టం జరిగినట్లు ఆరోపించారు. ధాన్యం చేతికొచ్చే సమయానికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్రంలో అమలు చేయకపోవడంతోనే రైతుల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ధీమా కలిగించే బీమా పథకం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. మార్చిలో అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేలు పరిహారం అందిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పి నెలలు గడుస్తున్న రైతుల ఖాతాలో ఎందుకు జమ చేయడం లేదని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 30 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యా విపత్తులకు నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు బేతి మహేందర్ రెడ్డి, లింగంపల్లి శంకర్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.