మహబూబాద్ లో ఉద్రిక్తత

మహబూబాద్ లో ఉద్రిక్తత
  • వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల అరెస్టు
  • పాదయాత్రకు అనుమతి రద్దు 
  • హైదరాబాద్ కు తరలింపు

ముద్ర ప్రతినిధి‌, మహబూబాబాద్: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల, మహబూబాబాద్ ఎమ్మల్యే శంకర్ నాయక్ మధ్య మాటల వివాదం ఆదివారం తీవ్ర ఉద్రిక్తతతకు దారితీసింది. ముందుగా శంకర్​ నాయక్  షర్మిలను ఉద్దేశించి శనివారం తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. దీనికి షర్మిల ఘాటుగా రియాక్టయ్యారు. ‘నీ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే ఇష్టానుసారం మాట్లాడతావా?’ అంటూ మండిపడ్డారు. ‘మమ్ములను వలసదారులు అంటున్న నీవు నెల్లూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా?’ అని నిలదీశారు. భూముల కబ్జాలు, మాఫియాలతో రాజ్యం ఏలుతున్నారన్నారు. అధికారంలో వచ్చిన నాలుగేళ్లలో పోడు భూములకు ఒక్క పట్టా ఇవ్వలేదని సీఎం మీదా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నదని గ్రహించిన పోలీసులు పాదయాత్ర అనుమతిని రద్దు చేసి, షర్మిలను అరెస్టు చేసి  హైదరాబాద్ కు తరలించారు. 

మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్
షర్మిల నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలంటూ  గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హితవు పలికారు. సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నదని, ఇక్కడ ఇతర నాయకుల పాలన అవసరం లేదని పేర్కొన్నారు. రాజన్న రాజ్యానికి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం జరిగిందని మంత్రి గుర్తుచేశారు. ఏం ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అండదండలతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కోట్ల ఆస్తులకు యజమానులు అయ్యారు అంటే, అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే అని గుర్తు చేశారు. రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని తుంగలో తొక్కి ఆ పార్టీ ద్వారా సంపాదించుకున్న వేల కోట్లతో వేరే పార్టీ పెట్టి ఊరేగుతుంది మీరంటూ  విమర్శించారు. 


మహిళలను గౌరవించే సర్కారు కాదు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదని, బీఆర్​ఎస్​ పార్టీ మహిళలను గౌరవించే పార్టీ కాదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ లో షర్మిల మీడియాతో మాట్లాడుతూ తన పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల  మైలురాయి దాటినప్పటి నుంచి అడుగడుగునా ఆడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నర్సంపేటలో ఇబ్బందులు క్రియేట్ చేశారని, మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇదే రిపీట్ చేశారని, ప్రభుత్వ అవినీతిపై మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని ప్రశ్నించారు. తమ పార్టీకి ఆదరణ వస్తుందనే భయంతోనే అడ్డుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగడాల ఆధారాలు ఉన్నాయన్నారు. వాటికి సంబంధించిన వీడియోలను చూపించారు. ఓ మహిళను పట్టుకుని ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడటం సరైనదేనా అని ప్రశ్నించారు. కేసీఆర్ ది దిక్కుమాలిన పాలన అని విమర్శించారు. మహిళలంతా కేసీఆర్​ ప్రభుత్వంపై తిరుగబడాలని షర్మిల పిలుపునిచ్చారు.