కాజీపేట రైల్వే స్టేషన్ కు  రూ.24.5 కోట్లు

కాజీపేట రైల్వే స్టేషన్ కు  రూ.24.5 కోట్లు
  • పనుల ప్రారంభానికి మోడీ వర్చువల్ గా శంకుస్థాపన
  • దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి 

ముద్ర ప్రతినిధి, వరంగల్: అమృత్ భారత స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 508 రైల్వేస్టేషన్ ల పునరాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో కాజీపేట రైల్వే స్టేషన్ కు అవకాశం కల్పిస్తూ కేంద్రం రూ.24.5 కోట్లను కేటాయించింది. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వర్చువల్ పద్ధతిలో ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా హన్మకొండ బీజేపీ జిల్లా అధ్యక్షులు రావు పద్మ కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో కాజీపేట చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ మాట్లాడారు. 

  • 7 వేల మందికి ఉపాధి..

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగానే కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీని నెలకొల్పుతున్నామన్నారు. దీని ద్వారా 7000 మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. కాగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వే స్టేషన్లు స్వరూపాన్ని మార్చుకోబోతున్నాయన్నారు. స్టేషన్ల ఆధునీకరణ వల్ల వ్యాపార వాణిజ్యం సామాజిక సాంస్కృతి కార్యక్రమాలు చేనేత హస్తకళలను ప్రోత్సహించేందుకు వేదికగా మారబోతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ సర్క్యులేషన్, ఇంటర్, మోడల్, ఇంటిగ్రేషన్, ప్రయాణికుల మార్గదర్శకత్వం కోసం  కచ్చితత్వంతో  పనిచేయబోతున్నాయన్నారు. కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ఇన్​చార్జి డాక్టర్ బి.మురళీధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

  • రూ. 24,470 కోట్లతో 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధి

దేశంలో అవినీతి, కుటుంబ పాలన కనుమరుగు కావాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆగస్టు 15న ప్రతీ ఒక్కరూ ‘హర్​ఘర్​ తిరంగా’ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆదివానం దేశంలోని 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోడీ వర్చువల్​గా శంకుస్థాపన చేశారు.ఆయా రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మొత్తం 24,470 కోట్లు కేటాయించినట్లు మోడీ తెలిపారు.