రాజన్నకు ఇచ్చిన మాట తప్పిన సిఎం కేసీఆర్

రాజన్నకు ఇచ్చిన మాట తప్పిన సిఎం కేసీఆర్
  • ఏటా రూ.100 కోట్లు యాబడోయినయ్
  • రాజన్నసిరిసిల్ల జిల్లాలో టీపీసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలో టీపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర రెండవ రోజు కొనసాగింది.రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గంలో తన యాత్రను కొనసాగించారు. వేములవాడ రాజన్నకు సిఎం కేసీఆర్ ఇచ్చిన మాట ఏమైందని, ఏటా రూ.100 కోట్లు యాడబోయినయని ప్రశ్నించారు. రాజన్న ఆలయాన్ని ప్రతీ ఏటా 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాట తప్పాడన్నారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. తాగు నీటి సమస్యను కూడా తీర్చలేకపోయాడని తెలిపారు. 2018లో చెన్నమనేని రమేష్ ఒడిపోతాడనే భయంతో సూరమ్మ ప్రాజెక్ట్ కు శిలాఫలకం వేశారన్నారు. 43 వేల100 ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచారన్నారు.

ఇన్నేళ్లయినా తట్ట మట్టి కూడా తీయలేదని విమర్శించారు. ఈ ప్రాంతంపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన వివక్షనే.. కేసీఆర్ పాలనలో కొనసాగుతోందని విమర్శించారు. 40ఏళ్ల కింద తనకు ఇక్కడే తనకు పెళ్లి జరిగిందని... ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ చెప్పిండన్నారు. 40 ఏళ్ల కింద కేసీఆర్ కు ఇక్కడ  లగ్గం అయిందో లేదో తెలియదుకానీ... వేములవాడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆయన లగ్గం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని రేవంత్ తెలిపారు.గుడిని, గుడిలో లింగాన్ని దిగమింగే ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు.ఇక్కడి ఎమ్మెల్యేను కలవాలంటే జర్మనీకి పోవాల్సిన ఖర్మ పట్టిందన్నారు.ఈ ప్రజలపై ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు ప్రేమ లేదని పేర్కొన్నారు.

అందుకే భారత పౌరసత్వం వదులుకున్నారని, ప్రజలతో బంధం తెంచుకున్నారని తెలిపారు.ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే.. ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని ప్రజలకు పిలుపునిచ్చారు.మిడ్ మానేరు బాధితులు గా కేసీఆర్ కుటుంబం ఆర్ అండ్ ప్యాకేజీ తీసుకున్నారన్నారు.కానీ పెళ్లైన గిరిజన ఆడ బిడ్డలకు మాత్రం ఇవ్వనంటున్నారని, సీఎం కేసీఆర్ కుటుంబానికి ఒక న్యాయం... మా గిరిజన బిడ్డలకు ఒక న్యాయమా? అని రేవంత్ ప్రశ్నించారు.వేలకోట్లు ఉన్న మీ కుటుంబం.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తీసుకుని పేదల పొట్ట కొడతారా? అని ప్రశ్నించారు.తెలంగాణ తెచ్చిన అన్న వారికి రెండుసార్లు అవకాశం ఇచ్చారని,తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండని రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఒక్క అవకాశం ఇస్తే...ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5లక్షలు సాయం అందిస్తామన్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని,.ప్రతీ పేద రైతులు రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.ప్రతీ పేద ఆడబిడ్డకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు.సూరమ్మ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేసి 43వేల ఎకరాలకు నీరందిస్తామని తెలిపారు.గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటామని రేవంత్ రెడ్డి హమీ ఇచ్చారు. ఈ యాత్రలో కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, నాగుల సత్యనారయణ, కూస రవీందర్,కనకయ్యతదితరులు పాల్గొన్నారు.