సంబరాలు మాని గండ్లు పడిన చెరువులకు మరమ్మత్తులు చేయండి

సంబరాలు మాని గండ్లు పడిన చెరువులకు మరమ్మత్తులు చేయండి

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి చేయలేదు

ప్రభుత్వానికి మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సూటి ప్రశ్న

ముద్ర న్యూస్,కాటారం: భారీ వర్షాలకు గండ్లు పడి తెగిపోయిన చెరువులకు మరమ్మత్తులు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్,అధికార పార్టీ మంత్రులు,ఎమ్మెల్యేలు చెరువుల వద్ద సంబరాలు ఎలా చేసుకుంటారని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూటిగా ప్రశ్నించారు. సంబరాలు మాని చెరువులను మరమ్మత్త చేసి ఆయకట్టుకు సాగునీరు అందించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న ఉత్సవాలు సంబరాలకు నిరసనగా భారీ వర్షాలకు రెండేళ్ల క్రితం గండ్లు పడి తెగిపోయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహాదేవపూర్ మండలాల్లోని వీరాపూర్ శివశంకర్ ప్రాజెక్టు, ఒడిపిలవంచ ఊర చెరువు, బొమ్మ పూర్ మందార చెరువు లను సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా తెగిపోయిన చెరువులను మరమ్మత్తు చేయాలని ముఖ్యమంత్రి, మంత్రులు, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులను పలుమార్లు కోరినా నిధులు కేటాయించి ఎలాంటి మరమ్మత్తు చర్యలు చేపట్టలేదని తెలిపారు.

దీంతో మహాదేవ్పూర్,పలిమెల,కాటారం,మహాముత్తారం,మలహర్రావు మండలాలలో తెగిపోయిన 16 చెరువులు మరమ్మతుకు నోచుకోలేకపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో రెండేళ్లుగా పంటలు పండించకుండా పోవడంతో వేలాది ఎకరాల పంట పొలాలన్నీ బీడుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెగిపోయిన చెరువుల లో నీరు నిలువ లేక పంటలు పండించకపోవడంతో వేలాది మంది రైతులు ప్రభుత్వ సహాయం కోసం అన్నమో రామచంద్రా అంటూ ఎదురుచూస్తున్నారని అన్నారు.తెగిపోయిన చెరువుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టకుండా  సంబరాలు చేయడం హేయమైనా చర్యగా అభివర్ణించారు. ఈ ప్రాంతంలోని ఐదు మండలాల బీడు భూములకు సాగున్న మీరు అందించడం కోసం మొదలుపెట్టిన చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులను 9 ఏళ్లుగా పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ యంత్రాంగం వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు.

అలాగే మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ వల్ల వేలాది ఎకరాలు నీట మునిగి రైతులు నష్టపోతే ప్రభుత్వం ఎలాంటి పంట నష్టపరిహారం అందించలేదని అన్నారు. రైతులను నిండా ముంచిన అన్నారం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వం లేజర్ షోలు, కచేరీలు,సంబరాలు జరుపుకోవడం ఈ ప్రాంత రైతులపై ప్రభుత్వ విధానాలను తెలియజేస్తుందని పేర్కొన్నారు. మా మంథని నియోజక వర్గం ంలోని రైతుల భూములు లాక్కొని ఈ ప్రాంతం గుండా వెళుతున్న గోదావరి నదిపై పార్వతి,లక్ష్మీ,సరస్వతి మూడు బ్యారేజీలు నిర్మించి ఈ ప్రాంత భూములకు మాత్రం చుక్క సాగునీరు అందించడం లేదని అన్నారు. మా ప్రాంతంలోని నీరు,ఇసుక తరలిస్తూ ఈ ప్రాంత రైతులకు,ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వ విధానాలను ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి తెగిపోయిన చెరువులను మరమ్మతులు చేసి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాటారం మండల పరిషత్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి,స్థానిక సర్పంచులు రమేష్ రెడ్డి, రవికుమార్,రాజయ్య, ఎంపీటీసీ మహేశ్వరి,సందీప్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.