1,600 ఇళ్ల  నిర్మాణాలు పూర్తి చేయాలి కలెక్టర్ రాజర్శి షా ఆదేశం

1,600 ఇళ్ల  నిర్మాణాలు పూర్తి చేయాలి కలెక్టర్ రాజర్శి షా ఆదేశం
Collector Rajarshi Shah

ముద్ర ప్రతినిధి, మెదక్: ముగింపు దశలో ఉన్న 1,600 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల  నిర్మాణాలను శరవేగంతో పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్ లతో కలిసి ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, తహసీల్ధార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలాల వారీగా ఇండ్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించారు. ప్లాస్టరింగ్, తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రిసిటీ వంటి మిగిలిపోయిన చిన్న చిన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.

తహసీల్ధార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఇండ్ల నిర్మాణాలు గావించిన పది మండలాలలో ఎలక్ట్రిసిటీ, నీటి సౌకర్యం వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఉపాధికి హామీ పధకం క్రింద సి.సి. రోడ్లు, డ్రైనేజి వంటి నిర్మాణ పనులు చేపట్టాలని సూచంచారు.  లబ్దిదారులను గుర్తించి  పారదర్శకంగా ఎంపిక చేయాలని ఆదేశించారు. ఇంతవరకు అందజేసిన 1,234 ఇండ్లకు సంబంధించి ఆన్ లైన్ లో లబ్ధిదారుల వివరాలు పొందుపరచాలన్నారు. కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ లోని నిబంధనల మేరకు సకాలంలో పనులు పూర్తి చేయాలని, ఏఏ పనులు ఎప్పటి వరకు పూర్తిచేస్తారో కార్యాచరణ నివేదిక అందజేయాలని, నిర్మాణాలకు అవసరమైన ఇసుకను సరఫరా చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో పంచాయత్ రాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి, ఆర్డిఓ శ్యామ్ ప్రకాష్, డిప్యూటీ ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, తహసీల్ధార్లు తదితరులు పాల్గొన్నారు.