మెదక్ జిల్లాలో భారీ వడగళ్ల వాన నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు

మెదక్ జిల్లాలో భారీ వడగళ్ల వాన నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు

నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు
ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో పలుచోట్ల మంగళవారం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ స్థంబాలు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు రహదారులకు అడ్డంగా పడ్డాయి. ఒక్కసారిగా వాతావరణం నరిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వడగళ్లు పడ్డాయి. కొనుగోలు కేంద్రాల వద్ద, మార్కెట్​ యార్డుల్లో వడ్లు తడిసిపోయాయి. జిల్లా కేంద్రమైన మెదక్​ పట్టణంలో అరగంటసేపు వడగళ్లతో కుండపోత వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో చర్చి కాంపౌండ్​, కోర్టు, ఇందిరా కాలనీలో నాలుగు విద్యుత్ స్థంబాలు నేలకూలాయి. దీంతో కరెంట్​ సరఫరాకు అంతరాయం కలిగింది. ఓల్డ్​ బస్టాండ్​ సమీపంలో ఓ ఇంటి పిట్టగోడ కూలి పడటంతో పక్కనే ఉన్న బైండ్ల నాగరాజు ఇంటి పైకప్పు కూలిపోయింది. వ్యవసాయ మార్కెట్​ యార్డులో భారీ వర్షానికి ధాన్యం తడిసిపోయాయి. రామాయంపేట మండలంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది.  పలుచోట్ల వడగళ్లు పడ్డాయి. పొలాల్లో వడ్లు నేలరాలిపోగా, రోడ్లపై ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యింది. నిజాంపేట మండలం కేంద్రంలో ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి.

చల్మెడలో మామిడి కాయలు రాలిపోయాయి. పాపన్నపేట మండలంలో ఈదురు గాలులకు మెదక్​ – బొడ్మట్​పల్లి రూట్లో,  ఏడుపాయల కమాన్​ వద్ద చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దౌలాపూర్​లో కుర్మ మొగులయ్య ఇంటి పైకప్పు రేకులు ఎగిరి చాలా దూరంలో పడ్డాయి. లింగాయిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం జలమయం అయ్యింది. హవేలి ఘనపూర్​ మండలం జక్కన్నపేటలో వడగళ్లు పడ్డాయి.  చిన్న శంకరంపేట మండలం టి.మాందాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దయ్య ఇంటిపై కప్పు రేకులు గాలి దుమారానికి ఎగిరిపోగా, ఇంట్లోని ధాన్యం, బట్టలు తదితర వస్తువులు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. దీంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కౌడిపల్లి మండలంలో వర్షానికి రైతులు నిల్వచేసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. మెదక్ మండలం ఖాజీపల్లి వద్ద చెట్టు కూలి రోడ్డుకు అడ్డంగా పడింది.  మల్కాపూర్ తండాలో పశువుల పశువుల పట్నం రేకులు ఎగిరిపోగా మేకలు, గొర్రెలు వెళ్లిపోయాయి.