మరింత ప్రజా సేవ కోసమే ఎమ్మెల్యే గా పోటీ

మరింత ప్రజా సేవ కోసమే ఎమ్మెల్యే గా పోటీ

ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్న మర్రి రాజశేఖర్​ రెడ్డి 

మల్కాజిగిరి, ముద్ర:  తాము నిర్వహిస్తున్న వైద్య కళాశాల ద్వారా ప్రజలకు  సేవలు అందిస్తున్న మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాజకీయాలలోకి వచ్చారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాజశేఖర్ రెడ్డి కలిసి వచ్చింది. అధికార పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఆయనకు లభించింది. తన తల్లి అరుంధతి పేరిట ఆయన మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు పేదలకు అందిస్తున్నారు. ఎంఎల్ ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో పలు ఇంజనీరింగ్ కళాశాలలు,  స్కూళ్ళు విజయవంతంగా నడుపుతున్నారు. ఇదే క్రమంలో మెడికల్ కాలేజీ స్థాపనకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి లక్ష్మారెడ్డి పేరుతో పలు విద్యాసంస్థలు ఉండడంతో, మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు తన తల్లి అరుంధతి పేరిట మెడికల్ కాలేజీ నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు.

ఎం ఎల్ ఆర్ కళాశాల ప్రాంగణంలోని ఒక భవన సముదాయాన్ని ఆస్పత్రిగా  మార్చి వైద్య కళాశాల నిబంధనల మేరకు అవసరమైన సదుపాయాలతో పాటు పూర్తిస్థాయి కార్పొరేట్ ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాలను కూడా సమకూర్చారు. తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం కొన్ని సంవత్సరాల నుంచి ఆధునిక సదుపాయాలతో పూర్తిస్థాయి మల్టీ స్పెషాలిటీ వైద్యం పూర్తిగా ఉచితంగా మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దుండిగల్ లోని అరుంధతి ఆసుపత్రి సేవలందిస్తూ ఉంది. బిల్లింగ్ కౌంటర్ లేకుండా పదివేల సర్జరీలు ఉచితంగా చేసిన ఆసుపత్రి ఇది. రోగి వైద్య పరీక్షల నుంచి ఉచిత  వైద్యం అందిస్తూ అవసరమైన వారికి  మందులను కూడా  అందజేస్తారు.  తన తండ్రి లక్ష్మారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో మార్పు రావాలంటే విద్యను అత్యంత ప్రాధాన్యత రంగంగా గుర్తించి ఇంజనీరింగ్ విద్యాసంస్థలను నెలకొల్పి అందులో విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దుతున్నారు. 

 సామాజిక కార్యక్రమాలు:  అట్టడుగు వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం,  సమాజ వికాసానికి తన వంతు సహకారం అందించాలని, సేవా దృక్పథంతో వివిధ వర్గాలకు మర్రి రాజశేఖర్ రెడ్డి తన సేవలు అందిస్తున్నారు. తన సామాజిక సేవలను మరింత విస్తృతం చేయాలని దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి  కేసీఆర్​ను  ఆదర్శంగా తీసుకొని తన మామ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తో కలిసి కేసీఆర్​ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో  క్రియాశీలక సభ్యత్వం తీసుకుని రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత పార్టీలో కీలక నేతగా ఉంటూ పార్టీ  కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. 2019లో మల్కాజిగిరి  ఎంపీ స్థానానికి  బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. ప్రజాసేవయే పరమావధిగా భావించి ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్తూ పార్టీ అధినేత మన్ననలు పొందారు.  మల్కాజిగిరి  నియోజకవర్గంలో తన సతీమణి మమతారెడ్డి తో కలసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజల లో మమేకమై వారి మన్ననలను పొందుతున్నారు. ప్రజా దీవెనలతో అసెంబ్లీలో అడుగు పెట్టుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.