వీడిన దీప్తి హత్య కేసు మిస్టరీ. హత్యచేసింది చెల్లెలే..

వీడిన దీప్తి హత్య కేసు మిస్టరీ. హత్యచేసింది చెల్లెలే..
  • ప్రియుడితో కలిసి చెల్లి నగలు ఎత్తుకెళ్లడం చూసిన అక్క..
  • విషయం తెలిసిందని అక్క నోటికి, ముక్కుకు ప్లాస్టర్ వేసి హత్య..
  • 70 తులాల బంగారం, రూ.1.20లక్షల నగదుతో పారిపోయిన జంట 
  • అరెస్టు వివరాలు వెల్లడించిన  జగిత్యాల ఎస్పీ ఎగ్గడి  భాస్కర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కోరుట్లలో నాలుగు రోజుల క్రితం జరిగిన  దీప్తి హత్య కేసులు పీటముడి వీడింది. ప్రియుడితో కలిసి మృతురాలు చెల్లె హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ విలేకరుల సమావేశంలో అరెస్టు వివరాలను వెల్లడించారు. కోరుట్ల పట్టణం భీముని దుబ్బ ప్రాంతానికి చెందిన బంక దీప్తి(22) తల్లిదండ్రులు ఆగస్టు28 హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ కి వెళ్లారు. ఇంట్లో దీప్తితోపాటు ఆమె చెల్లెలు చందన ఇద్దరే ఉన్నారు. బంక చందన హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చేస్తుండగా 2019లో  హైదరాబాద్ కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరు ఇద్దరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 

చందన పెళ్లి చేసుకోమని ఉమర్ పై ఒత్తిడి తీసుకురాగా జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకుంటాను చెప్పాడు. ఆగస్టు 28న  తమ ఇంట్లో డబ్బు, నగలు ఉన్నాయని వాటిని తీసుకొని వెళ్లి స్థిర పడదామని ఉమర్ సుల్తాన్ కు ఫోన్ చేసి రమ్మని చెప్పింది. ప్లాన్ ప్రకారం చందన బ్రీజర్, అక్క దీప్తికు వొడ్క తాగిపించింది. ఆమె నిద్రపోగానే అప్పటికే హైదరాబాద్ నుంచి కారులో వచ్చి వెయిట్ చేస్తున్నా ఉమర్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. అర్ధరాత్రి ఇంట్లో ఉన్న 70తులాల బంగారు ఆభరణాలు, రూ .1.20 లక్షలు తీసుకొని పారిపోదామని డబ్బు నగలు తీస్తుండగా అక్క దీప్తి లేచింది.  ఏం చేస్తున్నారని అరవగా చందన, ఉమర్ చున్నీతో దీప్తి నోరుని, చేతులు కట్టేశారు. మళ్లీ అరుస్తుండంతో దీప్తి నోటికి, ముక్కుకు ప్లాస్టర్ వేశారు. బంగారు ఆభరణాలు డబ్బుతో పారిపోయే ముందు దీప్తి నోటికి ఉన్న ప్లాస్టర్  తీసివేయగా అప్పటికే మృతి చెందింది. చందన, ఉమర్ ఇద్దరు కారులో హైదరాబాద్ పారిపోయి ఉమర్  తల్లి సయ్యద్ అలియా మెహబూబ్, చెల్లెలు షేక్ ఆసియా ఫాతిమాలకు నగలు అప్పగించారు. 

వీటిని అమ్మి వచ్చిన డబ్బు తీసుకొని  ముంబై లాంటి ప్రాంతాలకు పారిపోయి స్థిరపడాలనుకున్నారు. మృతురాలు దీప్తి తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మెట్ పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చేపట్టి నిందితులను శనివారం కోరుట్ల నుంచి ఆర్మూర్ బాల్కొండ వైపు కారులో వెళ్తుండగా పట్టుకున్నారు. నిందితులు బంక చందన ఆమె ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్, తల్లి సయ్యద్ అలియా మహబూబ్, సోదరి షేక్ ఆసియా ఫాతిమా, హాపీజ్ లను పోలీసులు పట్టుకొని వారి వద్ద నుంచి 70 తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు, కారు, సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసు ఛేదించడంలో చాకచక్యంగా  వ్యవహరించిన మెట్​పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి, కోరుట్ల సీఐ ప్రవీణ్ కుమార్, కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ ఎస్సైలు కిరణ్, చిరంజీవి, కిరణ్ కుమార్, పోలీస్ కానిస్టేబుల్ విజయ్, పురుషోత్తం, శీనును ఎస్పీ అభినందించారు.