కేసీఆర్ పవర్ ఫుల్ లీడర్

కేసీఆర్ పవర్ ఫుల్ లీడర్
  • రాజ్‌భవన్‌కు-, ప్రగతి భవన్‌కు గ్యాప్‌ లేదు
  • తెలంగాణ బర్త్ డే-.. నా బర్త్ డే ఒకేరోజు
  • నిబంధనలతో నన్ను అడ్డుకోలేరు
  • గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పొలిటికల్ నామినేషన్ కాదు
  • అర్హత ఉందనిపిస్తే వెంటనే సంతకం చేస్తా
  • గవర్నర్‌గా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న తమిళిసై
  • రాజ్ భవన్ లో చిట్ చాట్

ముద్ర, తెలంగాణ బ్యూరో : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ లీడర్.. పవర్ ఫుల్ నేత. నాలుగేళ్లుగా కేసీఆర్ పాలన చూస్తున్నా. ప్రోటోకాల్​నిబంధనలతో నన్ను ఎవరూ అడ్డుకోలేరు. కోర్టు కేసులు, విమర్శలకు భయపడను. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అనేది పొలిటకల్ నామినేషన్ కాదు.. నిబంధనల మేరకు వారికి ఎమ్మెల్సీ అర్హత ఉందనిపిస్తే వెంటనే సంతకం చేస్తా’. అని గవర్నర్ తమిళి సై తెలిపారు. గవర్నర్ పదవి చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం రాజ్ భవన్ లో తమిళిసై చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో కాఫీ టేబుల్‌ బుక్‌ ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గవర్నర్‌గా తాను రాజకీయాలు చేయలేదని, ప్రజలకు సేవ చేసేందుకే ప్రయత్నించానని పేర్కొన్నారు. 

అందులో వాస్తవం లేదు..

రాజ్‌భవన్‌కు-, ప్రగతిభవన్‌కు గ్యాప్‌ ఉందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని గవర్నర్​తెలిపారు. ఆర్టీసీ బిల్లుపై అనవసర రాద్ధాంతం జరిగిందని, తాను కార్మికుల లబ్ధి కోసమే బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించానని గుర్తు చేశారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల కేటగిరిపై, ప్రభుత్వం పూర్తిగా స్పష్టత ఇవ్వలేదని, అందుకే ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీ జాబితాకు ఆమోదం తెలపలేదన్నారు. రాజ్యాంగ పరిరక్షరాలిగా బాధ్యతలను నిర్వహిస్తానని గవర్నర్ స్పష్టం చేశారు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా పనిచేయడం తనకు సంతోషంగా ఉందన్నారు. బాధ్యతలు, విధులను సమర్థవంతగా నిర్వర్తిస్తూ.. తెలంగాణలో నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకున్నానని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో వివాదాలు పెట్టుకునే ఉద్దేశం తనకు లేదన్నారు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరిగిందని, కాలేజీలు ఇవ్వడానికి కేంద్రం అడిగిన సమయంలో రాష్ట్రం స్పందించలేదనే విషయాన్ని కేంద్రం చెప్పిందన్నారు. 

రాజ్ భవన్ ను ప్రజా భవన్ గా మార్చా..

రాజ్ భవన్ ను ప్రజా భవన్ గా మార్చానని తమిళిసై తెలిపారు. తెలంగాణ పండగులైన బోనాలు, బతుకమ్మను రాజ్ భవన్ లో జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. సమ్మక్క సారక్క జాతరలో పాల్గొన్న మొదటి గవర్నర్ ను తానేనని చెప్పారు. ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులను సందర్శించానని, హైదరాబాద్ విమోచన దినోత్సవం తొలిసారి రాజ్ భవన్ లో జరుపుకున్నామని చెప్పారు. జమిలి ఎన్నికలకు తన మద్దతు ఉంటుందన్నారు. 

గవర్నర్ ఆఫీస్‌కు నిధుల కొరత..

ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉందని, కానీ గవర్నర్ ఆఫీస్‌కు కొంత లిమిట్ ఉందని తమిళిశై గుర్తు చేశారు. అలాగే నిధుల కొరత కూడా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయడం తప్ప.. పొలిటికల్ ఎజెండా లేదన్నారు. తెలంగాణ బర్త్ డే-.. నా బర్త్ డే ఒకేరోజు. నా మైండ్ లో ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలనే ఉంటుందన్నారు. తాను నిరంతరం సంతోషంగా ఉండే వ్యక్తినన్నారు. పుదుచ్చేరికి కూడా గవర్నర్ గా ఉన్నా.. తెలంగాణ ప్రజల కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నానని తమిళై తెలిపారు.