రైస్ మిల్లర్ల దోపిడీ నుండి రైతులను కాపాడడం అధికారుల బాధ్యత కాదా

రైస్ మిల్లర్ల దోపిడీ నుండి రైతులను కాపాడడం అధికారుల బాధ్యత కాదా

ధర్మ కాంట తూకం.. ట్రక్ షీట్ వ్యత్యాసంతో రైతుల దోపిడీ
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ ప్రమాద బీమా వర్తింప చేయాలి 
నీరా అంటే ఏంటో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలుసా
ఎమ్మెల్సీ టి.  జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైస్ మిల్లర్లలో దాన్యం అన్లోడ్ చేసే ముందు ధర్మకాంట తూకం వేస్తూ ట్రక్ షీట్ ను పరిగణలోకి తీసుకుంటూ కోత విధిస్తున్నారని ధర్మకాంట తూకం, ట్రక్ షీట్ తూకంలో వ్యత్యాసమే రైతుల దోపిడీకి నిదర్శనమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ఎమ్మెల్సీ సందర్శించి,  తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం సారంగాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో ఇప్పటికే పంట నష్టపోయి దిగుబడి తగ్గిందని  దీనికి తోడు మిల్లర్లు దగా చేస్తున్నారన్నారు. రైస్ మిల్లర్ల దోపిడీకి ప్రత్యక్ష ఆధారాలు ఉన్న ఎందుకు అదుపు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడానికి సంబంధించి ప్రభుత్వం నుండి ప్రకటనలే తప్ప క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న దాఖలాలు కనపడడం లేదు. పంట నష్టం పరిహారం అందించడానికి దాన్యం సేకరణ ప్రభుత్వ ఆలోచన విధానం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాల్సిందిపోయి రాబోయే సీజన్ అడ్వాన్స్ చేస్తామనడం హాస్యాస్పదం అన్నారు.

సీజన్ అడ్వాన్స్ చేయడం ప్రభుత్వం చేతిలో ఉండదని,  కాలానికి అనుగుణంగానే సాగు చేయడం సాధ్యమైతుందన్నారు. నీర అనే పదార్థాన్ని కొత్తగా కనుగొన్నట్లు నీరా కేఫ్ లు అంటూ ఆర్భాటాలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని, అసలు నీరా అంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలుసా అని ప్రశ్నించారు. సూర్యోదయం కన్నా ముందు తీసేదే నీరా.. గ్రామాల్లో  ప్రజలకు నీరా తెలుసు.. కల్లు తెలుసని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు గీత కార్మికుల సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా గీతకార్మికుల ఉపాధి, వృత్తిని బలోపేతం చేసేలా బెల్టు షాపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో అనుమతి లేని మద్యం విక్రయ దుకాణాలను అరికట్టడం పోలీస్ శాఖ బాధ్యత కాదా.. పోలీసుల దృష్టికి రావడం లేదా అని ప్రశ్నించారు. శాంతి భద్రత పర్యవేక్షణ పై దృష్టి పెట్టాల్సిన పోలీసు శాఖ ప్రభుత్వానికి ఆదాయం  సమకూర్చే శాఖగా మారిందని అన్నారు.

గీత కార్మికులు వృత్తిలో మరణిస్తే రూ. 5 లక్షలు  పరిహారం చెల్లించే విధానం ప్రస్తుతం అమల్లో ఉందని, సకాలంలో గీతా కార్మికులకు పరిహారం చెల్లించలేక ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు గీతకార్మికులకు గీత బీమా అంటూ తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. రైతు బీమా మార్గదర్శకాలను గీతకార్మికుల గీతబీమాకు వర్తింపచేయాలని,  రాష్ట్రంలోని దారిద్ర రేఖకు దిగువన ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఐదు లక్షల ప్రమాద బీమా వర్తింప చేయాలని, లేనిపక్షంలో ప్రమాద భీమా కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో చేర్చి అధికారంలోకి రాగానే బిపిఎల్ కుటుంబాల అందరికీ భీమ వర్తింప చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ మండల ఎంపీపీ మసర్తి రమేష్,  కొండ్ర రాంచంద్రారెడ్డి, ఉరుమల్ల లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ ఎన్.గంగాధర్, సత్యనారాయణ రెడ్డి, ఆకుల రాజిరెడ్డి పాల్గొన్నారు.