కందికొండ రామస్వామి స్మారక జాతీయ పురస్కారం

కందికొండ రామస్వామి స్మారక జాతీయ పురస్కారం

●అభ్యుదయమే వారసత్వం కావాలి
●  కష్టజీవుల పక్షాన కవిత్వం రావాలి.
● గౌడవృత్తి జీవితమే " కల్లంచుల బువ్వ "

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:అభ్యుదయం వారసత్వంగా రావాలని అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని, అసమానతలు లేని రాజ్యం వస్తుందని సిపిఎం రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్ అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీ మీటింగ్ హాలులో నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కామ్రేడ్ కందికొండ రామస్వామి స్మారక జాతీయ పురస్కారం - 2022 అవార్డును సన్మాన పత్రాన్ని, పదివేల నగదును ఈ. రాఘవేంద్రకు మున్సిపల్ చైర్మన్ కల్పన, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి రామస్వామి సతీమణి చంద్రమ్మలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పి.వహీద్ ఖాన్ అద్యక్షత వహించారు.ఈ సభలో కిల్లే గోపాల్ మాట్లాడుతూ వారసత్వం రాజకీయాలకు, సంపదకు, అస్తులకు కాకుండా ఆశయాల కోసం రావాలని ఆ నేపథ్యంలో కామ్రేడ్ రామస్వామి కమ్యూనిస్టు ఆశయాలను వారసత్వంగా వారి కొడుకు కందికొండ మోహన్, కూతురు కందికొండ గీత కొనసాగిస్తున్నారని వారి కుటుంబం పేదలపక్షాన నడుస్తున్నదని అన్నారు.

నేడున్న పరిస్థితులలో కవులు, కళాకారులు ప్రజల పక్షాన, మానవత్వం మహనీయులు ఆశయాలవైపు నిలబడి తమ రచనలు కవిత్వాలు చేయాలని కోరారు.ఈ సమావేశంలో కాళోజీ రాష్ట్ర పురస్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ.రాఘవేంద్ర రచించిన కవిత్వం తాటి, ఈత గీత కార్మికుల జీవన తాత్వికతను తెలియజేస్తుందని నేటి సమాజంలో గౌండ్లు ఎదుర్కొంటున్న పరిస్థితులను కవిత్వంగా రాశాడని నాయిన ఎదుర్కొన్న కల్లుగీతలో ఎదురైన అనుభవాలను దుఃఖాన్ని, గీతవృత్తి చెమటధారల్ని "కల్లంచుల బువ్వ”కవిత్వంలో పలికించాడని కవి రాఘవేంద్రను అభిందించారు. 

రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ చైర్మన్ కూచుకుళ్ల రాజేష్ మాట్లాడుతూ కందికొండ  రామస్వామి లాంటి మహినీయులూ ఈ ప్రాంతంలో పనిచేయడం వారి ఆశయాలను వారి కుటుంబం కొనసాగించడం అభినందనీయం ఆయన పేరున కవిత్వానికి పురస్కారం ఇవ్వడం గొప్పవిషయంగా సంతోషంగా ఉందని అన్నారు.పురస్కారానికి ఎంపికైన కల్లంచుల బువ్వ దీర్ఘకవితను ప్రముఖ కవిగాయకులు కల్వకోల్ మద్దిలేటి అద్భుతంగా సమీక్ష చేశారు.పురస్కార గ్రహీత ఈ.రాఘవేంద్ర మాట్లాడుతూ 2022  వ సంవత్సరానికి గాను వచ్చిన కవిత్వ సంపుటాలలో నా దీర్ఘకవితను ఎంపిక చేసి, కష్టజీవుల పక్షాన పోరాడిన కామ్రేడ్ కందికొండ రామస్వామి పేరు మీద పురస్కారం పొందడాన్ని అదృష్టంగా భావిస్తున్నాని, ఈ పురస్కారాన్ని అందజేసిన కందికొండ రామస్వామి కుటుంబానికి, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదికకు, న్యాయనిర్ణేతల కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అబ్దుల్లా ఖాన్, సి. భాస్కర్ రావు, వర్దం పర్వతాలు,  ఐద్వా నాయకురాలు కందికొండ గీత, జెట్టి ధర్మరాజు, కందికొండ మోహన్, కందికొండ రమేశ్, కందికొండ సురేశ్,హెచ్.రమేశ్ బాబు,  శ్రీధర్, డి.రాములు, పెబ్బేటి మల్లికార్జున్, వనపట్ల సుబ్బయ్య, ముచ్చర్ల దినకర్ , బాలీశ్వర్ , వెంకట్ పవార్,ఎదిరేపల్లి కాశన్న ,ఎండి ఖాజా ,కురుమూర్తి, ఎజ్జు మల్లయ్య, తిరుపతయ్య, దేవదానం, రఘురాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.