ఆత్మీయ సమ్మేళనం నుండి బయటకు వెళ్లిన నేతలు...

ఆత్మీయ సమ్మేళనం నుండి బయటకు వెళ్లిన నేతలు...

ఆత్మకూరు ఎం (ముద్ర న్యూస్): నవంబర్ 30న జరగనున్న శాసనసభ ఎన్నికలలో ఆలేరు నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొంగిడి సునీత మహేందర్ రెడ్డి విజయాన్ని భుజస్కంధాలపై వేసుకున్న ఆలేరు మాజీ శాసనసభ సభ్యులు మరియు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్ ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించి. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమ్మేళనం లో భాగంగా ఇటీవల ఆత్మకూర్ ఎం. గుండాల మండలాలకు చెందిన గౌడ సామాజిక వర్గంతో నిర్వహించిన సమావేశంలో గొంగిడి సునీత మహేందర్రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తున్న సమయంలో కొంతమంది గౌడ సామాజిక వర్గం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గౌడ సామాజిక సమ్మేళనం అని చెప్పి రాజకీయాలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ సందర్భంగా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గౌడ సోదరులకు నేను మాట్లాడడం ఇష్టం లేనట్లు ఉంది అని అసహనం వ్యక్తపరిచినట్లు తెలిసింది. ఈ విషయమై వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన గౌడ సామాజిక వర్గం నేతలు మాట్లాడుతూ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం గౌడ సోదరులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని బిఆర్ఎస్ నాయకులు నేడు కొంతమంది రాజకీయ నాయకులను మచ్చిక చేసుకుని ఆత్మీయ సమ్మేళనం పేరుతో పిలిచి మోసం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి స్వార్థ రాజకీయాలకు స్వస్తి చెప్పకుంటే రానున్న ఎన్నికలలో గౌడ సామాజిక వర్గం తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు.