కొత్త పార్లమెంట్ భవనానికి.... అంబేద్కర్ పేరు పెట్టండి

కొత్త పార్లమెంట్ భవనానికి.... అంబేద్కర్ పేరు పెట్టండి

.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టి బిజెపి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన 79 మంది లబ్ధిదారులకు 33 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బుధవారం ఎమ్మెల్సీ శ్రీహరి అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పార్లమెంటు భవనానికి ఆయన పేరును పెట్టి బిజెపి ప్రభుత్వం తమ చిత్తశుద్ధి చాటుకోవాలి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రపంచంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని 2016 ఏప్రిల్ 14 శంకుస్థాపన చేసినట్లు కడియం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో విగ్రహ ఏర్పాటు కమిటీ చైర్మన్ గా తనతోపాటు కొంతమంది నేతలం చైనాకు వెళ్లి వచ్చి ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే నేడు రూ.145 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం గర్వించదగ్గ విషయం అన్నారు.

దళిత, బడుగు, బలహీన వర్గాలకు దైవ సమానులైన అంబేద్కర్ లేకుంటే మనమంతా ఎక్కడ ఉండేవాళ్ళం అని అంబేద్కర్ పెట్టిన బిక్ష అన్ని వర్గాల అభివృద్ధికి నాంది అయిందన్నారు. తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తు అయితే ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ వచ్చిందని వచ్చిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యమన్నారు. ఇక్కడ అమలు చేయని అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక బిజెపి, కాంగ్రెస్ పార్టీలు టిఆర్ఎస్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని వారి ఆటలు ఇక చెల్లవని కడియం స్పష్టం చేశారు. దళితుల ఆర్థిక స్వాలంబన కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు ద్వారా ఇప్పటికీ 40 వేల కుటుంబాలు ఆర్థిక సహాయాన్ని పొందాయన్నారు. ఈ ఏడాది లక్ష మందికి 17 వేల 700 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నట్లు శ్రీహరి తెలిపారు.

విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం రంగాల కోసం ఏటా ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలబడడం కెసిఆర్ కే సాధ్యమవుతుందని అందుకే ఆయనకు అండదండగా ఉండాలని కడియం పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి, బెలిద వెంకన్న, మామిడాల లింగారెడ్డి, బుర్ల శంకర్, తాళ్లపల్లి వెంకటయ్య, తీగల కరుణాకర్, నీల గట్టయ్య, రాపోలు మధుసూదన్ రెడ్డి, పల్లె రవి, ఎల్లమ్మ కంటి నాగరాజు, కుల్ల మోహన్రావు, అయోధ్య, పెసరు రమేష్, ఎర్రబల్లి శరత్, రాజేష్ నాయక్, ఐలోని సుధాకర్, పోకల నారాయణ, చాడ రాజ్ కుమార్, అశోక్ బాబు, జీడి ప్రసాద్ పాల్గొన్నారు.