"అందుకో దండాలు" పాటను.... విరాహత్ కు అంకితం చేసిన మాస్టార్జీ

"అందుకో దండాలు" పాటను.... విరాహత్ కు అంకితం చేసిన మాస్టార్జీ

దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అందుకో దండాలు బాబా అంబేడ్కరా...అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో....

పాటను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీకి, ఆ పాట రచయిత, సుప్రసిద్ధ వాగ్గేయకారులు, దళితోద్యమ నాయకులు మాస్టార్జీ అంకితం చేశారు.విశ్వజన కళామండలి 45వ, వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, మాస్టార్జీ రాసిన పాటల్లో,45 పాటలను తెలుగు రాష్ట్రాలకు చెందిన 45 మంది సామాజికవేత్తలు, ప్రజా ఉద్యమకారులకు అంకితం చేశారు. ఇందులో "అందుకో దండాలు" పాటను మంగళవారం నాడు రవీంద్ర భారతిలో జరిగిన సభలో ప్రజా పాత్రికేయులు, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమ నేత విరాహత్ అలీకి ప్రముఖ సినీ దర్శకులు, నిర్మాత తమ్మిరెడ్డి భరద్వజ్, సుప్రసిద్ద ప్రజా గాయని విమలక్కల చేతులమీదుగా అందించారు. అనంతరం మాస్టార్జీ మాట్లాడుతూ, దాదాపు మూడు దశాబ్దాలుగా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం, మరో వైపు పీడిత, తాడిత ప్రజల గొంతుకగా నిలబడి అవిశ్రాంతంగా పోరాడుతున్న ప్రజా జర్నలిస్టు విరాహత్ అలీకి తన పాటను అంకితం చేయడం ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. మెతుకుసీమలో జరిగిన ఎన్నో ప్రజా ఉద్యమాల్లో విరాహత్ అలీ పోషించిన పాత్ర అభినందనీయమన్నారు.

మరపురాని ఘట్టం-విరాహత్ అలీ

తాను ఎంతో ఇష్టపడే "అందుకో దండాలు" పాటను మాస్టార్జీ నుండి స్వీకరించడం జీవితంలో మరపురాని ఘట్టమని విరాహత్ అలీ అన్నారు. తన మనస్సును హత్తుకున్న ఈ పాటను స్వీకరించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా దళితోద్యమ సభల్లో "అందుకో దండాలు" పాట ప్రార్థన గీతమైందన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా మాస్టార్జీతో తనకు ఆత్మీయ అనుబంధం కొనసాగుతుందని, ఆయన సాహిత్యాన్ని తాను ఎంతో అభిమానిస్తానన్నారు. ఈ సందర్భంగా మాస్టార్జీకి కృతజ్ఞతలు తెలిపారు.