గులుగుడు గునుగుడే.. గుద్ధుడు గుద్దుడే

గులుగుడు గునుగుడే.. గుద్ధుడు గుద్దుడే

ఇల్లందు రోడ్ షోలో మంత్రి కేటీఆర్ 
ఇల్లందు, ముద్ర : గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇల్లందులో ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియ గెలుపు కోసం నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ హ్యాట్రిక్ ప్రభుత్వం రావాలంటే ఇల్లందులో హరిప్రియాను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.  ఇండియా మూడోసారి వరల్డ్ కప్ గెలవాలి, కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ తో ప్రభుత్వం ఏర్పాటు చేయ్యాలంటే ప్రతీ ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు. ఒక్క చాన్స్ఇవ్వండంటూ కాంగ్రెస్ ప్రజలను అడుగుతోంది కదా 11 సార్లు అవకాశమిస్తే రాష్ట్రానికి ఏం మేలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

కోట్ల మందిలో కొన్ని అభిప్రాయా బేధాలు ఉండటం సహజమేనని, అదేవిధంగా ఇక్కడ కూడా చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని తనకు తెలుసన్నారు. ఎన్ని విభేదాలున్నా అందరం కలిసి పని చేయాల్సిన తరుణం ఆసననమైందని చెప్పారు. సింగరేణి కార్మికులకు 36శాతం బోనస్ చెల్లించిన ఘనత కేసీఆర్ దేనని, ఆ కార్మికులను ఎక్కడికి బదిలీ చేయకుండా సంస్థతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 తర్వాత ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లో బోడు, కొమరారంలను నూతన మండలాలు ఏర్పాటు చేస్తామని,  సీతారామ ప్రాజెక్ట్ ను త్వరలో పూర్తి చేసి గోదావరి జలాలతో ఈ ప్రాంత రైతుల కాళ్ళు కడుగుతామని కేటీఆర్ అన్నారు. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు మాత్రం గెలిచామని కానీ ఈసారి సింహభాగం ఈ జిల్లా నుంచే రావాలని ఆయన కోరారు. ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లందులో అసైన్డ్ భూములున్న వారందరికీ శాశ్వత పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు.