ఇందిరమ్మ రాజ్యంలో ఎవరూ బాగుపడలేదు!

ఇందిరమ్మ రాజ్యంలో ఎవరూ బాగుపడలేదు!
  • పేదరికం లేని తెలంగాణ బీఆర్ఎస్ లక్ష్యం
  • భయంకరమైన మెజార్టీతో గులాబీ జెండా ఎగుతుంది
  • తెలంగాణను అడ్డుకున్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీయే..
  • జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్​ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్​ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విరుచుపడ్డారు. కాంగ్రెస్​ పార్టీ నాయకులు గెలిస్తే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామంటున్నారని, .. ఇందిరమ్మ రాజ్యం ఎవరూ బాగుపడ్డారని కేసీఆర్​ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందో అందరికీ తెలునన్నారు. జగిత్యాల కల్లోలిత ప్రాంతంగా డిక్లేర్ చేసి యువకులను పిట్టలెక్క కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దున్నే లేస్తే నెత్తురుకారుడే ఇందిరమ్మ రాజ్యమని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో దళితులు, గిరిజనులు, రైతులు బాగుపడ్డారా? అని సీఎం ప్రశ్నించారు. ఆ సమయంలో ప్రజలను ఎవరినైనా పట్టించుకున్నారా అని అన్నారు. ప్రజలను ఓటు బ్యాంకుగా మార్చుకొని రాజ్యమేలారే తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణలో 1969 లో 400 మంది యువకులను పిట్టలెక్క కాల్చి, లక్షల మందిని జైల్లో వేశారని దుయ్యబట్టారు. ఎమర్జెన్సీ పెట్టి  చీకటి రోజులు తెచ్చింది ఇందిరమ్మ రాజమ్మ కదా అని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఊరికేనే ఓట్లు వేయొద్దని ఎవరు చరిత్ర ఏంటో తెలుసుకొని ఓట్లు వేయాలని సూచించారు. 

వందశాతం అక్షరాస్యత..
పేదరికం లేని తెలంగాణ, కేరళలా వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం కేసీఆర్​ ఆన్నారు. పదవి కోసం కాదని.. తెలంగాణ సాధించిన వ్యక్తిగా తెలంగాణ ప్రజలు పెద్ద పదవిని కట్టపెట్టారని అది తనకు చాలని ఆయన అన్నారు. ఈ నెల 30న ఎన్నికలు.. 3న  లెక్కింపుతో దుకాణం బంద్ అనుకుంటారు కానీ.. అప్పుడే దుకాణం స్టార్ట్ అవుతుందన్నారు. ఇక్కడ మీరు ఏ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఆ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఇది పునాది అని రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో అని ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఎన్నికలంటే చాలా పార్టీలు అభ్యర్థులు నిలబడతారని, అభ్యర్థులు.. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల నడవడి,  దృక్పథం ఎలాంటివో ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీ కళ్ల ముందే పుట్టిందని తెలంగాణ రాష్ట్ర కోసం ఏర్పడిన పార్టీ  బీఆర్ఎస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ 15 యేళ్లు మడమతిప్పని  పోరాటం చేసి ప్రాణాలు కూడా లెక్కచేయకుండా తెలంగాణ సాధించిన విషయం మీకు అందరికీ తెలుసు అన్నారు. జగిత్యాల త్వరలోనే కరీంనగర్ పట్టణంలో మారుతుందన్నారు. మంచి ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలో బీఆర్ఎస్ గాలి వీస్తుందని 100శాతం భయంకరమైన మెజార్టీతో బీఆర్ఎస్ గెలవబోతుందని ఆయన జోస్యం చెప్పారు. జగిత్యాల పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని, ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్ కోరిన పలు అంశాలను కూడా నెరవేరుస్తానని డాక్టర్​సంజయ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని  కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, జెడ్పీ చైర్​పర్సన్ దావా వసంత, మాజీ మంత్రి రాజేశంగౌడ్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మోసగాళ్ల మాటలు నమ్మొద్దు
ఖానాపూర్, ముద్ర : కాంగ్రెస్ పార్టీ వాళ్లు తెలంగాణ ఇవ్వకుండా 50యేళ్లు మోసం చేసారని వారి మాటలు నమ్మొద్దని సీఎం కేసీఆర అన్నారు. 1956 కంటే ముందు మన పాలన మనకు ఉండేదని,  పోరాటం చేసి సాధించుకున్నామని సీఎం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ  ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు.  మన తెలంగాణ తెచ్చుకోవడానికి 15 సంవత్సరాలు ఎంతో పోరాటం చేస్తే గాని రాలేదన్నారు. ప్రత్యేక రాష్టం ఏర్పాటైన తరువాత రాష్టం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందన్నారు.  ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టటం జరిగిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడలేని విధంగా రైతుబంధుతో రైతులను ఆదుకున్నామన్నారు. ఖానాపూర్ నియోజకవర్గం సమస్యలను పార్టీ అభ్యర్థి జాన్సన్ నాయక్ తన దృష్టికి తెచ్చారని ఒక్క రోజు ఇక్కడే ఉండి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జాన్సన్ నాయక్ ఓటు వేస్తే నాకు వేసినట్లేనని, నా కొడుకు కేటీఆర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నట్లు చెప్పాడని, ఆయన దత్తత తీసుకుంటే నేను తీసుకున్నట్లేనని అన్నారు. ఒక్క రోజు ఇక్కడే ఉండి.. అధికారులతో వచ్చి నియోజకవర్గం సమస్యలు అన్ని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఏమ్మెల్సీ దండే విట్టల్, నాయకులు రవీందర్ రావ్, రాథోడ్ జనార్దన్, వేణుగోపాలచారి, రాంకిషన్ రెడ్డి, పూర్ణచందర్ నాయక్, రాథోడ్ రాము నాయక్, అంకం రాజేందర్, సక్కారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.