తెలంగాణ రాష్ట్ర దశబ్ది ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి..

తెలంగాణ రాష్ట్ర దశబ్ది ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి..

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవోపేతంగా నిర్వహించేలా చక్కటి కార్యాచరణతో సన్నద్ధం కావలసినదిగా సంక్షే మ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వచ్చే జూన్ నాటికి  తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని 10 వ వసంతంలోకి  అడుగిడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల పాటు  పండుగ వాతావరణంలో రోజు ఒక కార్యక్రమం చొప్పున జూన్ 2 నుండి 22 వరకు వివిధ శాఖల ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టుటకు షెడ్యూల్ ప్రకటించిందని అన్నారు. శనివారం జిల్లా సమీకృతసముదాయాలo లోని జిల్లా కార్యాలయంలో ఆడిటోరియంలోని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అధ్యక్షతన సమావేశ మందిరంలో జిల్లా వివిధ,  శాఖలు చేపట్టవలసిన కార్యక్రమాలపై తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలలో ఆయా శాఖలు  2 జూన్ 2014 నుండి నేటి వరకు చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతి, లబ్ధిదారుల వివరాలు, చేసిన ఖర్చుతోపాటు గ్రామ, నియోజక వర్గ, మునిసిపాలిటీ స్థాయిలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారో  కార్యాచరణ నివేదిక అందజేయవలసినదిగా సూచించారు.

నాడు-నేడు పేర  అప్పటి పరిస్థితి - నేటి ప్రగతి ద్వారా మార్పు స్పష్టంగా తెలిపే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కరపత్రం, పుస్తకాలూ ముద్రించి తమ కార్యక్రమం రోజు పంపిణి చేయాలని అన్నారు. సమగ్ర సమాచారం తమ క్రింది స్థాయి అధికారులకు తెలిసేలా ఉండాలన్నారు. ఈ సందర్భంగా  లబ్ధిదారుల విజయగాధలు, అభిప్రాయాలను నలుగురికి తెలపాలని అన్నారు. తమ కార్యక్రమాల రోజు ప్రజా ప్రతినిధులు, లబ్దిదారులను ఆహ్వానించాలని, చక్కటి ఫ్లవర్ డెకరేషన్ తో పాటు  లైటింగ్  ఏర్పాటు చేయాలని, నిర్దేశించిన రోజులలో సహా పంక్తి భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజక వర్గ ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలని, సంబంధిత ఆర్.డి.ఓ.లు 21 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను సమన్వయము చేసుకోవాలని ఆదేశించారు.

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 2న అవతరణోత్సవ వేడుకలు, 3న తెలంగాణ రైతు దినోత్సవం, 4న సురక్షా దినోత్సవం, 5న విద్యుత్ విజయోత్సవం, 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండుగ, 9న సంక్షేమ సంబురాలు, 10న సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణా రన్,  13న మహిళా సంక్షేమం, 14న వైద్య ఆరోగ్యం,15న పల్లె  ప్రగతి,16న పట్టణ ప్రగతి, 17న గిరిజనోత్సవం, 18న మంచినీలా పండుగ, 19న హరితోత్సవం, 20న విద్య, 21న ఆధ్యాత్మిక దినోత్సవం చివరగా జూన్ 22న అమరుల సంస్మరణ కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో  జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, సుంకే రవిశంకర్, ఎస్పీ భాస్కర్, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, మంద మకరంద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, డిసిఎంఎస్  చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు, తదితర అధికారులు పాల్గొన్నారు.