Revanth Hath Se Hath Jodo Yatra: కాంగ్రెస్ తోనే పేదల కష్టాలు తొలుగుతాయి..

Revanth Hath Se Hath Jodo Yatra: కాంగ్రెస్ తోనే పేదల కష్టాలు తొలుగుతాయి..
  • తెలంగాణలో మార్పు జరగాల్సిన అవసరం ఉంది..
  • రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలి..  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..
  • రెండో రోజు ములుగు జిల్లాలో కొనసాగిన యాత్ర..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పేదల అభివృద్ధి జరిగిందని, రాబోయే రోజుల్లో పేదల కష్టాలు తొలగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్పలో బస చేసి, మంగళవారం శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో గల అద్భుత శిల్పాలను తిలకించారు. అర్చకులు, గైడ్ ల ద్వారా అలయ చరిత్రను, ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో రామప్ప నుంచి రెండో రోజు యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా రామప్పలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు . రాష్ట్రంలో పురాతన కట్టడాలు, వారసత్వ సంపదను ముఖ్యమంత్రి కేసీఆర్ కూలగొట్టించే ప్రయత్నాలు చేస్తున్నాడని, వాస్తు పేరుతో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడని విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్నారు గాని, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప అలయ అభివృద్ధికి నిధులు ఎందుకు కేటాయించలేదని విమర్శించారు. సెక్రటేరియేట్ దగ్గర పురాతన కట్టాడాలు, వారసత్వపు సంపదను ముఖ్యమంత్రి కేసీఆర్ కూల్చివేసి, తన వాస్తును ప్రదర్శించారని ఆరోపించారు. తక్షణమే ఈ ప్రాంతంలోని ఆలయాలకు అవసరమైన నిధులు కేటాయించి, కళా సంపదను కాపాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సమస్యల తీవ్రతను పట్టించుకోకుండా కేసీఆర్ ఆస్తులు కూడబెట్టుకోవడం జరిగిందని, ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరింపజేసే పనిలో పడ్డారని విమర్శించారు.

తెలంగాణలో కేసీఆర్ పార్టీకి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో సమస్యలు పక్కన పెట్టి మోదీ ఎన్నికల ప్రణాళికలో మునిగి తేలుతున్నాడని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా పట్టించు కోవడం లేదని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో సమూల మార్పు రావాలంటే కేసీఆర్ ను గద్దె దించాలని, అందుకే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించేందుకు ఈ యాత్రను చేపట్టినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఇల్లు ఇస్తామని, ఇంటి నిర్మాణానికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కూలీలతో ముచ్చటించిన రేవంత్ రెడ్డి

 హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా పాలంపేట లోని రామప్ప నుండి బయల్దేరిన రేవంత్ రెడ్డి వెంకటాపురం మండలం కేశవాపూర్ లో వరి, మిర్చి తోటలో పనిచేస్తున్న మహిళా కూలీలు, రైతులను కలిసి మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పంట గిట్టుబాటు ధర గురించి అడిగి తెలుసుకున్నారు. కూలీలతో కలిసి కాసేపు రేవంత్ మిర్చి ఏరారు. మీ లాంటి రైతుల కష్టాలు వినేందుకు, కన్నీళ్లు తుడిచేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని, అందుకు అందరి సహకారం అవసరమని ఆయన చెప్పారు. 

ములుగులో ముగిసిన యాత్ర..


ములుగు జిల్లాలో రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మంగళవారం ముగిసింది. రెండో రోజు పాదయాత్రలో రామప్ప నుండి ములుగు వరకు చేరుకోగా, బుధవారం మహబూబాబాద్, గురువారం డోర్నకల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉన్నట్లు తెలిపారు.