ఉపాధి కూలీలకు తపాల శాఖ గుడ్ న్యూస్

ఉపాధి కూలీలకు తపాల శాఖ గుడ్ న్యూస్
  • ఇంటి వద్ద, పనిచేసే చోటే వేతనం తీసుకునే ఛాన్స్
  • ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
  • సూర్యాపేట డివిజన్  పోస్టల్ సూపరింటెండెంట్  వడ్లమూడి వెంకటేశ్వర్లు పిలుపు

ముద్ర ప్రతినిధి,సూర్యాపేట: తమ వేతనాలు తీసుకునేందుకు నానా ఇబ్బందులుపడే మహాత్మా గాంధీ ఉపాధి హామీ కూలీలకు తెలంగాణ తపాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ఉపాధి హామీ కూలీలకు బ్యాంకు ఖాతాలు లేకపోవటంతో వేతనాలు తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తపాల శాఖ వారి ఇక్కట్లను తొలగించేందుకు నడుంబిగించింది. ఇంటి వద్ద, పనిచేసే చోటనే వేతనాలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు సూర్యాపేట డివిజన్  పోస్టల్ సూపరింటెండెంట్ వడ్లమూడి వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రాష్టంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వ్యవసాయ కార్యకలాపాలు బాగా తగ్గిపోయి ఉపాధిహామీ పనులకు ప్రాధాన్యత పెరిగిందని, అయితే, ఉపాధి హామీ కూలీలు చేసిన పని వేతనాలు తీసుకునేందుకు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికోసం చక్కటి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. 

ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ కమీషనర్ ను కూడా సంప్రదించామని, ఈ సౌకర్యం సద్వినియోగం చేసుకునేందుకు సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీచేస్తామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సూర్యాపేట డివిజన్ లో 347 పోస్టాఫీసులు ఉన్నాయని, ఉపాధి హామీ కూలీలకు ఉపయోగపడే సేవింగ్, ఐపిపిబి ఖాతాలు  తెరుచుటకు అన్ని పోస్టాఫీసులలో తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఈ పోస్టల్ ఖాతాలు తీసుకుంటే ఇంటి వద్ద, పనిచేసే చోటనే వేతనాలు తీసుకోవచ్చునని, ఈ సౌకర్యాన్ని, అవకాశాన్ని ఉపాధి కూలీలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్  ఆ ప్రకటనలో కోరారు.