ప్రతి ప్రాణికీ దేవుడు ఆధారం...

ప్రతి ప్రాణికీ దేవుడు ఆధారం...
Samatha Murthy Utsavas from February 2
  • ఫిబ్రవరి 2 నుండి సమత మూర్తి ఉత్సవలు
  • పద్మభూషణ్ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
  • మీడియా సమావేశంలో చిన్నజీయర్ స్వామి వెల్లడి

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి: ప్రతి ప్రాణికీ దేవుడు ఆధారమని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు.సోమవారం రంగారెడ్డి జిల్లా ముచింతల్ వద్ద సమత మూర్తి  క్షేత్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ ఫిబ్రవరి 2 న సమత మూర్తి క్షేత్రంలో శ్రీ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం అయిన ఆర్ద్రా నక్షత్రంలో ఉత్సవాలు  ప్రారంభం అవుతాయని అన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 12వ తేదీ వరకు ముచ్చింతల్‌లోని సమతాస్ఫూర్తి కేంద్రంలో శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాన్యుల నుంచి ధీమాన్యుల వరకు సమతాస్ఫూర్తి అందరికీ అందేలా 216 అడుగుల శ్రీరామానుజుల భవ్య విగ్రహం ఆవిష్కృతమై అప్పుడే ఏడాది కావస్తుందని, ఈ నేపథ్యంలో సమతాకుంభ్‌ పేరుతో ఈ ఏడాది నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలను. ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తామని అన్నారు.మానవ చరిత్రకు నూతన ఉత్తేజాన్ని కలిగించే 108 దివ్యతిరుపతులు కొలువైన ఈ క్షేత్రాన్ని ఇప్పటికే కోట్లాదిమంది భక్తులు దర్శించారని వెల్లడించారు. అన్ని వర్గాల్లో అంతరాలను తొలగించేందుకు రామానుజుల వారు వెయ్యేళ్ల క్రితమే సమతా రిఫార్మ్స్‌ను తీసుకువచ్చారని, ఆనాటి కాలంలో సమతా స్ఫూర్తిని చాటడం అంటే ఎంతో గొప్ప విషయం అని చిన్న జీయర్ స్వామి గుర్తుచేశారు.

వెయ్యేళ్ల క్రితం ఆలయమే సమాజానికి కేంద్రంగా ఉండేదని, స్వామీజీ! ఆ ఆలయాల నుంచే మహిళలకు సాధికారత, బడుగువర్గాలకు ఆలయ ప్రవేశం కల్పించేలా రామానుజులవారు సమతాస్ఫూర్తిని రగిలించారని తెలియజేశారు. హరిజనులు, దళితులను కూడా ఆలయ సేవల్లో భాగస్వాములను చేశారని తెలిపారు. 108 దివ్యమూర్తులకు కల్యాణ మహోత్సవాలు జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుందన్నారు. అందుకు ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రం వేదికవుతోందని చెప్పారు.

గరుత్మంతుడు వేదానికి ప్రతీక అని, కదిలే రూపంలో సాగే గరుడ వాహన సేవ ప్రధానమైనదని,ఎక్కడైనా 1,9, 11 గరుత్మంతుడి వాహనంలో ఉత్సవాలు జరగడాన్ని చూస్తమని, కానీ సమతా స్ఫూర్తి కేంద్రంలో 18 మంది గరుత్మంతుల మీద భగవంతుడిని చూసే అవకాశం దక్కుతుందన్నారు. 8వ తేదీ జరిగే తెప్పోత్సవంలో స్వామి 18 రూపాల్లో దర్శనం ఇస్తారన్నారని చెప్పారు. అదే విధంగా 11వ తేదీన జరిగే భగవద్గీత పారాయణంలో లక్ష మంది పాల్గొంటారని సెలవిచ్చారు. ప్రతీ ప్రాణికి దేవుడు ఆధారం అనీ చెప్పే ముఖ్య ఉద్దేశమే ఈ బ్రహ్మోత్సవాల ప్రధాన లక్ష్యమని శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి అన్నారు. ప్రతీ ఒక్కరూ దర్శించుకునేలా బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లను చేసినట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో  శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌ స్వామి,శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌ స్వామి, ఉభ వేదాం విద్వాన్‌-మహాహోపాధ్యాయ శ్రీమాన్‌ సముద్రాల వేంకట రంగ రామానుజాచార్యులు, ఎస్వీ రంగ రామానుజాచార్యులు, వికాస తరంగిణి అధ్యక్షులు ఎం జగదీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.