సమన్వయంతోనే సమస్యల పరిష్కారం: డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి

సమన్వయంతోనే సమస్యల పరిష్కారం: డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి

అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే సమస్యల పరిష్కారం.. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి..

ముద్ర, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవనంలో జిల్లా పరిషత్ కార్యాలయం స్థాయి సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ అభివృధి, విద్యా, వైద్యం, ఆర్థిక ప్రణాళికలపైన సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా అనిత హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 2 లక్షల 7 వేల పెన్షన్లు ఇస్తున్నామన్నారు. 15 వేల పెన్షన్లు కొత్తగా మంజూరయ్యాయని, బ్యాంకు లింకేజి ద్వారా 865 కోట్లకు గాను 666.75 లక్షల బ్యాంకు రుణాలు డ్వాక్రా మహిళలకు అందించడం జరిగిందన్నారు.

పి.ఎం.ఎఫ్.ఎస్ ద్వారా 161 కొత్త యూనిట్లు మంజూరయ్యాయని, వాటిలో 100 యూనిట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. కొత్త మహిళా సంఘాలను గుర్తించాలని కోరారు. రంగారెడ్డి జిల్లాలో వాటర్ లెవెల్ 6.00 మీటర్లు ఉందన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు 89,451 మంది లబ్దిదారుల్లు ధరకాస్తు చేసుకోగా 2964 మంది ఎంపిక జరిగిందన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా పౌల్ట్రీ, డైరీ ఫామ్, సెరి కల్చర్, ఫిషరీస్  పరిశ్రమలకు సబ్సిడి ద్వారా పొందవచ్చన్నారు. డంపింగ్ యార్డుల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువు తయారు చేయాలన్నారు. ఆర్టీసి ద్వారా మరిన్ని ట్రిప్పులు పెంచి ప్రయాణికులకు మరింత సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పరీక్షల కాలంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యా శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. కడ్తల్  మండలంలో ఎక్స్పో ఫ్యాబ్ మెటల్ ప్రైమరీ లిమిటెడ్ ఇండియా అనే పరిశ్రమ వల్ల తీవ్ర శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని జెడ్పీటీసీ దశరథ్ నాయక్  ఛైర్ పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశానికి కాలుష్య నియంత్రణ బోర్డు కార్యనిర్వక అధికారి రాకపోవడంతో జడ్పీ చైర్ పర్సన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభకు హాజరు కావడం పట్ల ఫోన్ చేసి మాట్లాడారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం పేదలకు ఉపయోగ పడుతుందని తెలిపారు. కళ్ళ అద్దాలు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. కంటి వెలుగు పథకం కింద రోజుకు పదివేల మంది లబ్ధి పొందుతున్నారన్నారు. వైద్య శాఖ అధికారులు మరిన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించి పేద ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇబ్రహీం పట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సర్జరీలు జరగడం లేదని, ఆపరేషన్లు చేసేలా జిల్లా వైద్యాధికారులతో స్థానికంగా ఉండే వైద్యులు సమన్వయం చేసుకొని చికిత్సలు చేయాలన్నారు.

మనఊరు మన బడి కింద 38 పాఠశాలలు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని, జిల్లాలో 20 కేవీబీవీ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుందన్నారు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో బాల బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పైన అవగాహన కల్పిస్తుండడం పట్ల చైర్ పర్సన్ ప్రత్యేకంగా అభినందించారు. గ్రామాలలో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరి చేయాలని ఆదేశించారు. గత సమావేశాలలో చర్చించిన అంశాల్లో  మండలాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చిన్న చిన్న విద్యుత్ మస్యలు పరిష్కరించినందుకు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీలు మహిపాల్, దశరథ్ నాయక్, కో ఆప్షన్ మెంబర్ అలి అక్బర్ ఖాన్, శ్రీలత, జంగమ్మ, వెంకట్ రామ్ రెడ్డి, సీఈఓ దిలీప్ కుమార్, డిప్యూటీ సీఈవో రంగారావు పాల్గొన్నారు.