తెలంగాణ వచ్చాక జలకలతో కళకళలాడుతుంది

తెలంగాణ వచ్చాక జలకలతో కళకళలాడుతుంది

 నాటికీ నేటికి తేడా కళ్ళముందే కనబడుతుంది మంత్రి కొప్పుల ఈశ్వర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ వచ్చాక జలకలతో కళకళలాడుతుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ధర్మపురిలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాగునీటి దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లా ఉంది నేడు ఎట్లా ఉంది అని మన కళ్ళముందు కనపడుతుంది. నాడు నీటి కోసం గోసలు పడ్డాం...పంటలకు నీరు లేక ఒక్క పంట పండించడానికి రైతు అల్లాడి పోయేవారు కానీ నేడు ఎంత గొప్పగా నీరు అందుతున్నది అనేది మనకందరికీ తెలుసు అన్నారు. చెరువుల పునరుద్దరణ జరిగితే అన్ని కాలాలలో నీళ్లు సమృద్ధిగా ప్రజలకు అందుతాయి అనే గొప్ప ఆలోచనతో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టి నేడు ఆ ఫలితాలను పొందుతున్నాం కేసిఆర్ అంటేనే కాలువలు,చెరువులు,రిజర్వాయర్లు. కేసీఆర్ రాబోయే రోజుల్లో నీటి అవసరాన్ని బట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణలో మూడు పంటలకు నీరు అందించి తెలంగాణను అన్నపూర్ణగా మార్చారని అన్నారు.

చెరువుల పునరుద్దరణ, మంచి నీరు అందించడం అనేది కేసీఆర్ నాయకత్వనా సాధ్యమైంది తప్ప గతపాలకులకు చేతకాలేదు. మిషన్ భగీరద ద్వారా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చిన చరిత్ర కేవలం కేసీఆర్ ది. తెలంగాణ ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కేసీఆర్ నాయకత్వలో నడుస్తున్నామని, చెరువు మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని, కేసీఆర్ అన్ని రకాలుగా సబ్బండవర్గాలను ఆదుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమంలో ఆసరా,కేసీఆర్ కిట్,చేప పిల్లలు,గోర్లు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి ప్రజలను కడుపులో పెట్టుకొని చూస్కుంటున్న మహా నాయకుడు కేసీఆర్ అని,తిన్న రేవును తలవాలంటరు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు యాదిపెట్టుకొని కేసీఆర్ వెంట నిలబడాలని, తెలంగాణ ప్రభుత్వం,కేసీఆర్ ను ఎవ్వరు మరవద్దు.. ఆయన వెంట నిలబడి చేసిన ప్రగతిని సంక్షేమాన్ని వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, అడిషనల్ కలెక్టర్ బి.ఎస్.లత,డిసిఎంఎస్ చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీలు అరుణ, బాధినెనీ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ సంగి సత్తమ్మ, ఎఎంసి చైర్మెన్ అయ్యోరి రాజేష్, డిఆర్ డిఎ లక్ష్మినారాయణ, ప్రజాప్రతినిధులు,ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.