ధర్మపురి లో త్రాగు నీటి సమస్య.. మహిళ  కాంగ్రెస్ నిరసన 

ధర్మపురి లో త్రాగు నీటి సమస్య.. మహిళ  కాంగ్రెస్ నిరసన 
  • గోదావరి నీటితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కడిగి నిరసన 
  • నిరసన దృష్ట్యా డిసిసి అధ్యక్షుడు అడ్లూరి సహా పలువురి నేతల ముధస్తూ అరెస్ట్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధర్మపురిపట్టణంలో మిషన్ భగీరథ నీటి సరఫరా సరిగా లేక ప్రజలు త్రాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధర్మపురి పట్టణ మహిళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మపురిలో ని గోదావరి నది నుండి నీటిని తెచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కడిగి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్నధర్మపురి పోలీసులు తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు వెళ్లి మహిళ కాంగ్రెస్ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ధర్మపురి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ ధర్మపురి ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్య గురించి నిరసన తెలియజేయాలని అనుకుంటే ఈ విధంగా పోలీసులను పెట్టి మా  కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ధర్మపురిలో ప్రజాస్వామ్య పాలన కొనసాగడం లేదని కేవలం దొరల పాలన మాత్రమే నడుస్తుందని, గత నాలుగు సంవత్సరాలుగా ధర్మపురి ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్య గురించి జిల్లా కలెక్టర్  దృష్టికి,  మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన ఎటువంటి స్పందన లేదని, పక్కనే గోదావరి ఉన్నప్పటికీ ధర్మపురి ప్రజలు నీటికోసం ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.  ఇప్పటికైనా అధికారులకు  మహిళలు పడుతున్న గోస అర్థమై కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో ఈ విధంగా గోదావరి నీటితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కడిగి నిరసన తెలిపామన్నారు. ధర్మపురి ప్రజానీకానికి నీటి సరఫరా విషయంలో శాశ్వత పరిష్కారం చూపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంగనబట్ల సంతోషి దినేష్, కౌన్సిలర్ జక్కు పద్మ రవీందర్, కౌన్సిలర్ గరిగె అరుణ రమేష్, ఆశెట్టి మమత శ్రీనివాస్, చిట్టనోజు స్వప్న రమేష్, బొల్లారపు భూలక్ష్మి, బొల్లారపు సుకన్య, ధర్మపురి టౌన్ అధ్యక్షులు అప్పం తిరుపతి,ఆశెట్టి శ్రీనివాస్,  పురుషోత్తం,ప్రశాంత్, భరత్, దూడ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

డిసిసి అధ్యక్షుడు అడ్లూరి సహా పలువురి నేతల ముధస్తూ అరెస్ట్ 
ధర్మపురి పట్టణంలో త్రాగునీటి సమస్యఫై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మన్ కుమార్  ధర్మపురిలో త్రాగు నీటికోసం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో ధర్మపురి పోలీసులు కరీంనగర్ లో ఉంటున్నఅడ్లూరి లక్ష్మన్ కుమార్ ను అక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ధర్మపురి పట్టణంలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు.