రెండవ ఏఎన్ఎంల నోటిఫికేషన్ ను రద్దు చేసి బేషరతుగా  రెగ్యులరేషన్ చేయాలి..

రెండవ ఏఎన్ఎంల నోటిఫికేషన్ ను రద్దు చేసి బేషరతుగా  రెగ్యులరేషన్ చేయాలి..
  • తెలంగాణ రాష్ట్ర ఏఎన్ఎం యూనియన్ గౌరవ అధ్యక్షులు తోట రామాంజనేయులు డిమాండ్..
  • ఈనెల 16 నుండి 2వ ఏఎన్ఎంల నిరవధిక సమ్మె ప్రారంభం ..

భువనగిరి ఆగస్టు 14 (ముద్ర న్యూస్):- తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లందరినీ బేషరతుగా రెగ్యులరేషన్ చేసి, హేతుబద్ధంగా లేని నోటిఫికేషన్ రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఏఎన్ఎం యూనియన్ గౌరవ అధ్యక్షులు తోట రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం రోజున  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా (ఏఐటీయూసీ ఆధ్వర్యంలో) 2వ ఏఎన్ఎం చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన దీక్షకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దత్తు తెలిపింది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్ఎం ల యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తోట రామాంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్ఎం ల యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 16 తేదీ నుండి నిరవధిక సమ్మెను చేయనున్నట్లు  సచివాలయాన్ని ముట్టడించనున్నట్లు అయన తెలిపారు. నోటిఫికేషన్ రద్దు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో  ఈ నెల నాలుగవ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టినా అసెంబ్లీలో గౌరవ సభ్యులు  రెండవ ఏఎన్ఎం గురించి మాట్లాడినా కానీ ఇంతవరకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమన్నారు.

హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న హెల్త్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపార్ట్మెంటల్ పరీక్షలు పెట్టి అందరినీ రెగ్యులర్ చేశారని,  వారికి జిపిఎఫ్ ఎకౌంటులను కూడా మంజూరు చేశారని అయన తెలియజేశారు. ఏప్రిల్ 30 2023న జీవో నెంబర్ 16 ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్న 5554 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారని అదే మాదిరి గత 15 సంవత్సరాల నుండి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఈ రెండో ఏఎన్ఎంలు కూడా బేషరతుగా రెగ్యులర్ చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి 20 మార్కుల వెయిటేజీ ఇచ్చి ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి అదే 20 మార్కులు ఇవ్వటమేంటని అయన ప్రశ్నించారు. 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ లో 30 మార్కులను వెయిటేజీగా ఇచ్చి ఇప్పుడు 20 కి కుదించటం దారుణమైన విషయం అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులపై అధికమైన పనిభారం ఉన్న సంగతి హరీష్ రావుకు తెలిసినా తెలియనట్టు ఉంటున్నాడని అయన విమర్శించారు. క్రమబద్ధీకరణ  విషయమై ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు మంత్రులు పట్టించుకోకపోవడం వల్లనే విసిగిన ఏఎన్ఎంలు సమ్మె చేయాలనీ, నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. 15 సంవత్సరాలుగా ప్రభుత్వం కింద పనిచేస్తున్న వారు పని ఒత్తిడి వలన పరీక్షలకు సంసిద్ధం అవ్వలేరు కనుక వెంటనే ఈ విషయంపై స్పందించి ఆంధ్రాలో పెట్టిన మాదిరి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టి అందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని అయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోరేటి రాములు, ఎండి ఇమ్రాన్,  జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు తదితరులు మద్దతు తెలిపారు, 2వ ఏఎన్ఎం లు ధనమ్మ, నీలిమ, మంగా,  జయశ్రీ, విజయ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.