రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బి ఆర్ ఎస్ దే

రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బి ఆర్ ఎస్ దే
  • కర్ణాటక లో నిధులన్నీ బిఆర్ఎస్ ఇచ్చినవే
  • బిజెపి చీఫ్ బండి సంజయ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బి ఆర్ ఎస్ చేతిలో ఉందని, బిజెపి ని దెబ్బతీయడమే లక్ష్యంగా బి ఆర్ ఎస్, కాంగ్రెస్ లు కలిసి పని చేస్తున్నాయని భారతీయ జనతాపార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళుతూ మార్గమధ్యంలో నిర్మల్ లో విలేకరులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు భారత రాష్ట్ర సమితి కోట్లాది నిధులను వెచ్చించిందని అన్నారు. ఎన్ని ఎత్తుగడలు పన్ని కాంగ్రెస్ ను గెలిపించినా రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 6% మాత్రమే ఉందని అన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో అధికార పార్టీ పట్ల పలు ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ అభ్యర్థులు చాలా స్థానాల్లో ఓడిపోతారని కెసిఆర్ కు ముందే తెలుసునన్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఓడిపోయే అవకాశం ఉన్న సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక, లోపాయికారి మద్దతు కెసిఆర్ నేతృత్వంలోనే జరగబోతోందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ వారు గెలిచినా తిరిగి బిఆర్ఎస్ లో చేరపోవడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ కలిసి బిజెపి ని ఓడించేందుకు చేసే ఎత్తుగడలను ప్రజలు తిప్పికొడతారన్నారు. కవిత లిక్కర్ కేసును ప్రస్తావిస్తూ 
లిక్కర్ కేసులో కవిత ప్రమేయాన్ని కెసిఆర్ కూడా ఇంతవరకు ఖండించలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చివరికి ప్రతి విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసే ట్విట్టర్ టిల్లు కూడా ఖండించలేదంటేనే అది వాస్తవమని తెలుస్తోందన్నారు.ఈ పరిస్థితుల్లో ఆమె అరెస్టు గురించి ప్రస్తావిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.ఎవరెన్ని ఎత్తుగడలు పన్నినా ప్రజాదరణ బిజెపికే ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో అంజుకుమార్ రెడ్డి, సాదం అరవింద్, అయ్యన్న గారి భూమయ్య, ఒడిసెల శ్రీనివాస్, రాజు తదితరులు ఉన్నారు.