రెప్పపాటులో ఘోరం  నాలుగు కుటుంబాల్లో విషాదం

రెప్పపాటులో ఘోరం  నాలుగు కుటుంబాల్లో విషాదం
  • మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం నలుగురు చౌటపల్లి గ్రామస్తుల మృతి
  • గుజరాత్ లోని సూరత్ కు వెళుతుండగా ప్రమాదానికి గురైన కారు
  • సొంత ఊరికి వచ్చి వెళ్తుండగా జరిగిన ఘోరం

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి :మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపాన బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా వాసులు నలుగురు దుర్మరణం పాలయ్యారు.
రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో నలుగురు కుటుంబ యజమానులు చనిపోవడంతో నాలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బతుకు తెరువు కోసం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో నివసించే తెలంగాణ వాసుల మృతితో అక్కడ, సొంతూరు( ఇక్కడ ) లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఎరుకల కృష్ణ గౌడ్( 47), ఎరుకల సంజయ్ గౌడ్ (43), ఎరుకల సురేష్ గౌడ్ (38),ఎరుకల శ్రీనివాస్ గౌడ్ (36)లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ కారులో ఉన్న మరొక యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన రాజయ్య గౌడ్, రాములు గౌడ్లు బతుకుదెరువుపై గుజరాత్ లోని సూరత్ పట్టణంలో ప్లంబింగ్ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతుండేవారు. ఇదే పనిని వారి కుమారులకు నేర్పించి వారిని సైతం సూరత్ కు తీసుకెళ్లారు. అక్కడ రాజయ్య గౌడ్ కుమారులు కృష్ణ గౌడ్, సంజయ్ గౌడ్లు, రాములు గౌడ్ కుమారులు సురేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా నివసిస్తూ పొట్ట పోసుకుంటున్నారు. ప్లంబింగ్ కాంట్రాక్టులు చేస్తూ వచ్చే ఆదాయంపైనే కుటుంబాల్ని పోషిస్తున్నారు. కొడుకు లతో కలిసి రాములు గౌడ్ కూడా సూరత్ లోనే నివసిస్తుండగా, రాజయ్య గౌడ్ మాత్రం గత కొన్నాళ్లుగా స్వగ్రామంలో నివసిస్తున్నాడు. రాజయ్య గౌడ్కు రాములుతో పాటుతో కనకయ్య గౌడ్, లింగమూర్తి గౌడ్ మరో ఇద్దరు తమ్ములు కూడా ఉన్నారు.

వారిలో కనకయ్య గౌడ్ (68) గత శనివారం నాడు చౌటపల్లిలో చనిపోగా, ఆదివారం జరిగిన ఆయన అంత్యక్రియలకు సూరత్ లో ఉన్న రాములు గౌడ్ అతని భార్య, కొడుకులు సురేష్ గౌడ్( 38),  శ్రీనివాస్ గౌడ్(36) అతని మనుమడు, అన్న రాజయ్య గౌడ్ కొడుకులు కృష్ణ గౌడ్( 47) సంజయ్ గౌడ్(43) కలిసి ఏడుగురు ఒకే కారులో   చౌటపల్లి లోని ఇంటికి వచ్చారు.కనకయ్య గౌడ్ అంత్యక్రియలు ఆదివారం నాడు నిర్వహించిన అనంతరం సోమవారం నాడు మూడో రోజు కర్మ కార్యక్రమాన్ని పూర్తిచేసి నాలుగో రోజున మంగళవారం ఉదయం 10 గంటలకు రాజయ్య కుమారులు ఇద్దరూ, రాములు కుమారులు ఇద్దరు, రాములు మనుమడిని వెంటబెట్టుకొని ఐదుగురు కారులో బయలుదేరి తిరిగి సూరత్ వెళ్తున్నారు. ఐదుగురు వెళ్తున్న కారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురికావడంతో కృష్ణ గౌడ్, సంజయ్ గౌడ్ , సురేష్ గౌడు,శ్రీనివాస్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనివాస్ గౌడ్ కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తమ్ముని అంత్యక్రియలకు వచ్చిన కొడుకులిద్దరూ చనిపోవడంతో రాజయ్య గౌడ్ ఆయన భార్య భాగ్యమ్మ తీవ్రంగా రోదిస్తున్నారు కృష్ణ గౌడ్ భార్య సూరత్లో ఉండగా సంజయ్ గౌడ్ భార్య మొన్ననే వచ్చి చౌటపల్లిలో ఉన్నట్లు వారు తెలిపారు. ఇక అన్న చనిపోయిన విషయం తెలిసి కుటుంబ సమేతంగా విచ్చేసిన రాములు గౌడ్  కొడుకులిద్దరూ ప్రమాదంలో దుర్మరణం పాలు కాగా అతని ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఇదే ప్రమాదం నుంచి రాములు గౌడ్ మనవడు ప్రాణాలతో బయట పడ్డప్పటికీ సురేష్ ,శ్రీనివాస్ భార్యలు ఇద్దరూ సూరతు లోనే ఉన్నారు. ఈ వార్త తెలియగానే అక్కడ వారు శోకసముద్రంలో మునిగిపోయారు.

గ్రామమంతట విషాదం

 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో ఒకేసారి అన్నదమ్ముల కొడుకులు నలుగురు దుర్మరణం పాలైన విషయం తెలియడంతో గ్రామమంతట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న మంగళవారం ఉదయం 10 గంటల వరకు తమ కళ్ళముందే కదలాడి, అందరినీ ఆప్యాయంగా పలకరించి మళ్ళీ వస్తా మంటు వెళ్లిన నలుగురు తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలియడంతో గ్రామస్తులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. బాబాయ్ అంతక్రియలకు వచ్చిన నలుగురు అన్నదమ్ములు మూడు రోజులపాటు గ్రామంలో గడిపి, అందరితో ఆత్మీయంగా మెదిలి, వెళ్లారని గ్రామస్తులు తెలిపారు. రాజయ్య గౌడ్ ,రాములు గౌడ్ కుమారులు నలుగురు మృతి చెందడం పట్ల గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ ,గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు..