వ్యవసాయంతో అభివృద్ధి చెందాలి..

వ్యవసాయంతో అభివృద్ధి చెందాలి..
  • సీఎం చొరవతో పోడు రైతులకు పట్టాలు..
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:పట్టాలు పొందిన రైతులు వ్యవసాయంతో అభివృద్ధి చెందాలని, సీఎం కేసీఆర్ చొరవతో పోడు చేసుకున్న రైతులందరికీ పట్టాలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్ లో బుధవారం నిర్వహించిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా లు హాజరై అర్హులైన పోడు రైతులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారికి పట్టాలు రావడం హర్షనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గిరిజనులకు శాశ్వత భూ యజమానులుగా హక్కు కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీకీ శ్రీకారం చుట్టారన్నారు. జిల్లాలో సుమారు 3200మందికి పట్టాలను పంపిణీ చేస్తున్నామని, మొత్తం జిల్లా వ్యాప్తంగా 7800 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. గతంలో 1200 మందికి కూడా పట్టాలను అందిచడం జరిగిందని వివరించారు. 

మిగిలిన గిరిజనులకు కూడా తొందరలోనే పట్టాలని అందించడం జరుగుతుందని తెలిపారు. భారత దేశంలో ఎక్కడా కూడా లేనివిధంగా తెలంగాణలో అడవి హక్కు కలిగిన పట్టాలు, రైతు బంధు, రైతు భీమా లాంటి అవకాశాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని కొనియాడారు. గిరిజన గూడాలు, తండాలలో 350 కోట్లతో త్రీఫేస్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని, 75 ఏళ్లలో సాధ్యం కానీ అభివృద్ధి, కేవలం 9 ఏళ్లలోనే సాధ్యం చేసి చూపించిన ఘనుడు సీఎం కేసీఆర్ అని అన్నారు, గిరిజనుల గుండెల్లో సీఎం కేసీఆర్ సిరస్థాయిగా నిలుస్తారని చెప్పారు. చాలా కాలంగా ప్రభుత్వం భూమిలో సాగు చేసుకుంటున్న రైతులకు కూడా పట్టాలను అందించాలని ఈ సందర్భంగా వారు కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ అంకిత్, మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు, పోడు భూమి పట్టాల లబ్ధిదారులు పాల్గొన్నారు.