నిర్మానుష్యంగా రోడ్లు 

నిర్మానుష్యంగా రోడ్లు 
  • సుర్రు మంటున్న సూర్యుడు..
  • మేళ్ళచెరువు లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు... 
  • ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు...  

మేళ్ళచెరువు ముద్ర : వాతావరణం లో వస్తున్న మార్పుల వలన సూర్యుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం నుండి సూర్యుడు  సుర్రు అంటున్నాడు . ఫలితంగా సామాన్య ప్రజానీకం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి . ఉదయం 10 గంటలు దాటితే బయటకు వెళ్ళలేని పరిస్థితి. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి . మేళ్ళచెరువు  లో సోమవారం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకుంది .ఒకపక్క ఎండ మరోపక్క ఉక్క పోత మరోపక్క వడగాడుపులు ఉండటంతో ప్రజలు తల్లడిల్లి పోతున్నారు. ఇంట్లోనే ఫ్యాన్ల కింద ఆరుబయట చెట్ల కింద సేద తీరుతున్నారు. రోడ్డుమీదికి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. రోడ్డు వెంట వ్యాపారాలు నిర్వహించుకునే చిరు వ్యాపారులు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజులపాటు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకునే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా సూర్యుడి ప్రతాపానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం వచ్చేవారు మధ్యాహ్నం లోపే పనులు చూసుకుని వెళ్లిపోతున్న పరిస్థితి. మధ్యాహ్నం రోడ్లపై వాహనాలు కూడా తెలియని పరిస్థితి. కొంతమంది వ్యాపారులు మధ్యాహ్నం ఎండ వేడిమికి తట్టుకోలేక దుకాణాలు కూడా మూసివేసి సాయంత్రం తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. ఎండ తీవ్రత తో ఆయకట్టు ప్రాంత  ప్రజలు ఈ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవటం గతంలో ఎన్నడూ లేదు. ప్రతి ప్రాంతంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.