అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
  • ఉద్యోగ భద్రత కల్పించాలి..
  • అంగన్వాడిల డిమాండ్..
  • మూడవ రోజు కొనసాగిన సమ్మె 

మెట్‌పల్లి ముద్ర: అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ, సిఐటియు, అంగన్వాడిల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కోరుట్ల, మెట్‌పల్లి, పట్టణాలలో కోరుట్ల, కథలాపూర్,మెట్‌పల్లి,ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మండలాల అంగన్వాడిలు చేపట్టిన సమ్మె బుధవారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. అనేక సంవత్సరాల నుండి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పరిష్కారం చేయలేదని. రాష్ట్రంలో వీఆర్ఏలను, గ్రామపంచాయతీ సెక్రటరీలను, కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం పర్మినెంట్ చేసిందని వీరి గురించి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మా కోసం ఎందుకు ఆలోచించటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో అంగన్వాడీలు  పోరాటం చేశారని గుర్తు చేశారు.

అంగన్వాడి సంఘాల ఒత్తిడి మేరకు ఆగస్టు 18న స్వయంగా ఐసిడిఎస్ మంత్రి సత్యవతి రాథోడ్, హైదరాబాదులో అంగన్వాడి సంఘాలతో జాయింట్ సమావేశం నిర్వహించారని. అన్ని అంశాలను చర్చించి కొన్నింటి పైన నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలకు భిన్నంగా ఆగస్టు 25న అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ప్రభుత్వ ప్రకటించిందని. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు. వీరంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఎక్కువమంది ఉన్నారని అన్నారు. గత 48 సంవత్సరాలుగా ఐసిడిఎస్ లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని. కనీస వేతనం పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత తదితర చట్ట బద్ధ సౌకర్యాలు  రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కల్పించలేదన్నారు.స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడీ వర్కర్ పేరును టీచర్స్ గా మార్చారని గుర్తు చేశారు. కానీ టీచర్లతో సమానంగా వేతనాలు ఇతర సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదని. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేసి కనీస వేతనంగా 26 వేల రూపాయలు ఇవ్వాలని. పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షలు చెల్లించాలన్నారు. అంతేకాకుండా వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలన్నారు. 60 సంవత్సరాల తర్వాత అంగన్వాడి ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ కోరితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం 5లక్షలు చెల్లించాలన్నారు.

బిఎల్ఓ డ్యూటీలు రద్దు చేయించి ఐసిడిఎస్ కు సంబంధం లేని పనులు చేయించకూడదన్నారు. ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలని పక్కా భవనాలు మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఆరోగ్యలక్ష్మి చార్జీలు పెంచాలని. డబుల్ సిలిండర్ అన్ని కేంద్రాలకు ఇవ్వాలని. జిపిఎస్ యాప్ రద్దు చేయాలని రోజుకు మూడుసార్లు ఫోటో పెట్టే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరి, ఏఐటీయూసీ  అంగన్వాడి రాష్ట్ర కార్యదర్శి భాగ్యలక్ష్మి, మెట్‌పల్లి అర్బన్ అధ్యక్షురాలు మాధస్తు లక్ష్మి, పద్మ, రూరల్ అధ్యక్షురాలు కోలు సుమలత,దీప, మల్లాపూర్ మండలం సంధ్యారాణి, రజిత, ఇందిరా,ఇబ్రహీంపట్నం మండలం సమీ సుల్తానా, జి లక్ష్మి నర్సు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి ఉస్మాన్, రామిళ్ళ రాంబాబు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.