దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలి - కలెక్టర్ వరుణ్ రెడ్డి

దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలి - కలెక్టర్ వరుణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి , నిర్మల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశాబ్ది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ వరుణ్ రెడ్డి అధికారులకు సూచించారు. జూన్ 2 నుండి మొదలయ్యే దశాబ్ది ఉత్సవాలు,  నూతన సమీకృత కలెక్టర్ భవనం ప్రారంభం నేపథ్యంలో  ఎస్పీ ప్రవీణ్ కుమార్ తో కలసి  జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4 వ తేదీన కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించడానికి ముఖ్య మంత్రి రానున్న సందర్బంగా  అధికారులంతా అప్రమత్తం గా ఉండాలనీ, వివిధ శాఖల వారీగా కేటాయించిన బ్లాక్ లలో విధులు నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండి విధులు సక్రమం గా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

జూన్ 2 నుండి జూన్ 22 వరకు  నిర్వహించే  దశాబ్ది ఉత్సవాలను   ఘనంగా నిర్వహించాలన్నారు. శాఖల  వారిగా ఆయా తేదీలలో  నిర్వహించే  క్రమంలో  విజయగాధలు,  సంక్షేమ అభివృద్ధి వీడియోలు ప్రదర్శించాలని అన్నారు.
ఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ  పోలీస్ శాఖ నుండి పకడ్బంది  చర్యలు చేపట్టడం  జరుగుతుందని, ఎలాంటి అవాంఛనీయ  సంఘటనలు  జరగకుండా గట్టి బందోబస్తు  ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో  డిఎస్పీ జీవన్ రెడ్డి, డిఆర్వో లోకేష్, ఆర్డీవో స్రవంతి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.