దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కేసిఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ ప్రారంభం

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కేసిఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ ప్రారంభం

నిర్దేశిత వైద్యసేవలను ప్రజలకు అందుబాటులో తేవాలి 
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కేసిఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ ప్రారంభం
సబ్ సెంటర్ నిర్మాణానికి వారం రోజుల్లో మరో 400 కోట్ల నిధులు విడుదల 
సబ్ సెంటర్ నిర్మాణ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు త్వరగా ప్రారంభించాలి
ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలలో అందుతున్న వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ లు,  వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ  మంత్రి తన్నీరు హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వం మంజూరు చేసిన పల్లె,  బస్తీ దవఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ లు  త్వరగా పూర్తిచేసి  నిర్దేశిత వైద్య సేవలను ప్రజల కు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మంగళవారం మంత్రి హరీష్ రావు రాష్ట్ర స్థాయి వైద్య శాఖ ఉన్నత శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లు,  వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లాలలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ,  గర్భిణీ స్త్రీలలో అనేమియా సమస్య పరిష్కరించేందుకు  ప్రభుత్వం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేస్తుందని, మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలుచేసామని మిగిలిన 24 జిల్లాలకు విస్తరిస్తున్నామని అన్నారు. పుట్టబోయే బిడ్డల ఆరోగ్యం, తల్లి సంరక్షణ కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఉపయోగపడుతుందని,  ప్రతి గర్భిణీ స్త్రీకి 2 సార్లు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తామని, రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం లాంచ్ చేయాలని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో  63 సబ్ సెంటర్ భవనాలకు భూ కేటాయింపులు జరగలేదని, వీటిపై కలెక్టర్ శ్రద్ధ వహించి గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండే భూములను ఎంపిక చేసి సబ్ సెంటర్ల కేటాయించాలని, సబ్ సెంటర్ లో నిర్మాణం కోసం  ముందస్తుగా జిల్లా ప్రజా పరిషత్తులకు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలకు నిధులను విడుదల చేశామని, వారం రోజులలో మరో 400 కోట్ల నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. సబ్ సెంటర్ భవన నిర్మాణానికి నిధుల సమస్య లేనందున త్వరితగతిన 766 సబ్ సెంటర్ల టెండర్ల ప్రక్రియ ఫైనల్ చేసి పనులు ప్రారంభించాలని, సబ్ సెంటర్ లను త్వరితగతిన వేగంగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని, సబ్ సెంటర్ల నిర్మాణ పురోగతిపై కలెక్టర్లు తరచుగా రివ్యూ నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 15 రోజుల పాటు తీవ్రమైన ఎండలు ఉంటాయని, ఎండల కారణంగా వడదెబ్బ బారిన ప్రజలు పడకుండా అవసరమైన సూచనలు సలహాలు అందజేయాలని, ఉపాధి హామీ కార్మికులు పనిచేసే సమయంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు.వీడియో సమావేశం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష  మాట్లాడుతూ జిల్లాలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ నిర్మాణ పనులకు త్వరగా టెండర్ పూర్తి చేసి ప్రారంభిస్తామని,  దవఖానాలు ప్రారంభించి ప్రజలకు సేవలు అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.  

ఈ వీడియో కాన్ఫరెన్స్ లోల జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్.లత,   జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ , జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.