గాలివాన బీభత్సం

గాలివాన బీభత్సం
  • పాక్షికంగా పంట నష్టం
  • మల్కాపూర్లో దెబ్బతిన్న కళ్యాణ వేదిక
  • పిడుగుపాటుకు గేదె, ఆవు దూడ మృతి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో రెండు మండలాల్లోని తాటికొండ, కృష్ణాజి గూడెం, చిల్కూర్, మల్కాపూర్, కొత్తపల్లి, పుల్లగుట్ట, కొండాపూర్ మరి కొన్ని గ్రామాలలో వరి పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బలమైన గాలులు రావడంతో వరి నేలకు ఒరిగింది, మరికొన్ని చోట్ల వడ్లు నేలరాలాయి. పిడుగుపాటుకు తాటికొండ గ్రామానికి చెందిన బండ అశోక్ పాడి గేద మృతి చెందడంతో రూ.55 వేల నష్టం వాటిల్లింది.

ఇప్పగూడెంలో తాటి చెట్టుపై పిడుగు పడడంతో ప్రణాపాయం జరగనప్పటికీ తాటి చెట్టు మోగి నుండి పొగలు చిమ్ముతున్నాయి. చిల్పూర్ మండలంలో పిడుగు పడడంతో గొడుగు యాదగిరి అనే రైతుకు చెందిన ఆవు, లేగ దూడ వృత్తి వాత పడి దాదాపు లక్షన్నర ఆస్తి నష్టం జరిగింది.

చిల్పూర్ మండలం మల్కాపూర్ లో గాలి బీభత్సానికి చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో చిన్న పెండ్యాల - మల్కాపూర్ గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అదేవిధంగా తాటికొండ - స్టేషన్ ఘన్ పూర్ ప్రధాన రోడ్డు పై చెట్టు విరిగిపడడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మల్కాపూర్ లో ఈనెల 30న జరగనున్న శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం, ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాటుచేసిన (ఆలయ ఆకృతి) భారీ సెట్టింగ్ గాలి వానకు కొట్టుకుపోయింది. ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన ఏనుగుల ప్రతిమలు గాలి బీభత్సానికి పుట్టుకపోయి వేదికకు దూరంగా పడ్డాయి భక్తుల కోసం వేసిన చలువ పందిల్లు సైతం కొట్టుక పోయినట్లు గ్రామస్తులు తెలిపారు. మొత్తానికి అకాల వర్షం రెండు మండలాల్లో బీభత్సం సృష్టించింది.