కడియం శ్రీహరి.. దేవాదుల సృష్టికర్త కాదు... ఎన్ కౌంటర్ల సృష్టికర్త..!

కడియం శ్రీహరి.. దేవాదుల సృష్టికర్త కాదు... ఎన్ కౌంటర్ల సృష్టికర్త..!
  • తల్లి బీసీ, తండ్రి ఎస్సీ.. నువ్వేంటి ?
  • ముస్లింను పెళ్లి చేసుకున్న నీ కూతురు కులమేంటి?
  • ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘాటు విమర్శలు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ‘ఎమ్మెల్సీ కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్‌ కౌంటర్ల సృష్టికర్త..’ అని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఘాటు విమర్శలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో ఆది జాంబవంతుడి విగ్రహ ప్రతిష్ఠాపన భూమిపూజ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికేతరులైన గోక రామస్వామి, బొజ్జపల్లి రాజయ్య, కడియం శ్రీహరి, గుండె విజయరామారావు ఇక్కడి ప్రజలు, అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. తాను స్థానికుడిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ అనునిత్యం ప్రజల మధ్య ఉంటున్నానన్నారు. సకల జనుల సమ్మెతో తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే పోటీ చేయనన్న కడియం శ్రీహరి టీడీపీ  నుంచి నామినేషన్ వేశాడన్నారు. కడియం తల్లి బీసీ, తండ్రి ఎస్సీ అయినప్పుడు కడియం ఏంటిదని.. మోత్కుపల్లి చేసిన వాక్యాలను రాజయ్య గుర్తు చేశారు. ఇక ఆయన కూతురు కావ్య ఓ ముస్లింను పెళ్లి చేసుకుంటే ఆమె ఎస్సీ ఎలా అవుతుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కులాల కుళ్లుతో స్టేషన్ ఘన్ పూర్ మలినమైందని, కుల ఆత్మగౌరవంపై చర్చ జరగాలన్నారు. ఉద్యమ రోజుల్లో ఎక్కడ ఉండి అవకాశం కోసం పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి 2014 నుంచి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

ఆయనను పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పార్టీ వ్యతిరేకులు కడియం వెంట ఉంటే నియోజకవర్గ ప్రజలు నా వెంట ఉన్నారని స్పష్టం చేశారు. కడియం వెంట ఉంటున్న వాళ్లంతా నా వాళ్లేనని.. ‘రాంబాబు.. ఓ ఆటంబాం..’, ‘బ్రహ్మరెడ్డి.. ఓ బ్రహ్మాస్త్రం..’, ‘ఎన్ఆర్ నిన్ను నాశనం చేస్తాడు..’ అంటూ జోష్యం చెప్పారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి ఏంటి ఆ తర్వాత జరిగిన అభివృద్ధి ఏంటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. స్వార్థపూరిత రాజకీయం ఆయనది.. త్యాగం నాది అని రాజయ్య స్పష్టం చేశారు. నాలుగేళ్లు డిప్యూటీ సీఎంగా నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలన్నారు. తాను డప్పు కొట్టగలను, గజ్జ కట్టగలను పూరి గుడిసెల్లో తినగలను.. మరి నువ్వు కొట్టగలవా? పూరి గుడిసెల్లో తినగలవా? అని కడియంను ప్రశ్నించారు. ఆడియోలు, వీడియోలు అంటూ తనపై వస్తున్న ఆరోపణలను కోర్టు ద్వారా ఎదుర్కొంటానని రాజయ్య తెలిపారు. నియోజకవర్గంలో 85 వేల ఎస్సీల ఓట్లు ఉంటే 68 వేల ఓట్లు నికార్సైన మాదిగలవే అని వాళ్లు నా వెంట ఉన్నారన్నారు. ‘నీ వెంట ఎందరున్నారని ఎగిసి పడుతున్నావ్‌.. శ్రీహరీ.. తస్మాన్ జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. జడ్పీటీసీ మారపాక రవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, ఎంపీపీలు రేఖ, జయశ్రీ, సుదర్శన్, వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి, సర్పంచులు సురేశ్‌కుమార్, ఉమాదేవి, ఉప సర్పంచ్ మారుపాక రాములు, ఆకుల కుమార్, మహేందర్‌‌రెడ్డి, జైపాల్ రెడ్డి, బత్తుల సిద్దేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.