కార్మిక సమస్యలను కేసీఆర్ పరిష్కరించాలి - సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ 

కార్మిక సమస్యలను కేసీఆర్ పరిష్కరించాలి - సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : రాష్ట్రంలో ఉన్న కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే పరిష్కరించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం మే డే సందర్భంగా సిద్దిపేటలోని బస్సు డిపో వద్ద, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ వద్ద ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, ఏఐటీయూసీ ఏర్పాటుచేసిన మేడే ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ వద్ద ఏఐటియుసి జెండాను చాడ వెంకటరెడ్డి ఎగురవేశారు. అనంతరము ఏఐటీయూసీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సింగరేణి కార్మికుల సమస్యలు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ఈ విషయాన్ని కార్మిక సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం కాలేదన్నారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వము కార్మిక చట్టాలను కుదిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తూ ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తుందని ఆరోపించారు.అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో కార్మిక హక్కుల సాధనకై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. అమెరికాలో ప్రారంభమైన కార్మిక పోరాటాలు దేశంలో, రాష్ట్రంలో నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని, కార్మికుల రక్తంతో తడిసిన జెండానే ఎర్రజెండాగా అవతరించిందని చాడ వెంకటరెడ్డి తెలిపారు. 137 వ మే డే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీ యుసీ నాయకులు కృష్ణాపురం  లక్ష్మణ్, బిక్షపతి, సిపిఐ నాయకులు మంద పవన్, శంకర్, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు లోహిత్ రావు, శేషు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.