కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన ప్లీనరీ..

కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన ప్లీనరీ..
  •  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు..
  •  సంక్షేమ ఫలాల అమలులో ఆదర్శనీయం..
  • దేశానికి కేసీఆర్ సేవలు అవసరం.. 
  • భూపాలపల్లి ప్లీనరీలో మాట్లాడిన పలువురు వక్తలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుందూరుపల్లిలోని ఏఎస్ఆర్ గార్డెన్ లో మంగళవారం జరిగిన నియోజకవర్గస్థాయి పార్టీ ప్రజా ప్రతినిధుల ప్లీనరీ లో కేసీఆర్ ను పలువురు వక్తలు పొగడ్తలతో ముంచెత్తారు. మైకు ఎవరి చేతిలోకి వెళ్లినా కేసీఆర్ చేసిన పనులు, అందించిన సంక్షేమ ఫలాలపై మాట్లాడుతూ ప్రశంసలు గుప్పించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గ్రామ గ్రామాన మంగళవారం ఉదయం ముఖ్య కూడళ్ల వద్ద బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలను ఎగురవేశారు. అనంతరం  భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుందూరుపల్లిలో గల ఏఎస్ఆర్ గార్డెన్ లో వరంగల్ జడ్పీ చైర్మన్ భూపాలపల్లి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గంద్రజ్యోతి అధ్యక్షతన జరిగిన ప్లీనరీ సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, రాష్ట్ర వికలాంగుల సంస్థ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి, కార్యక్రమ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సా రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు హింగే మహేందర్ లు  హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ తెరాస పార్టీ అని, యావత్ భారత దేశ సమగ్రాభివృద్ధి కోసం తెరాస పార్టీ  భారత రాష్ట్ర సమితి పార్టీ గా పేరు మార్చడం జరిగిందని, దేశ అభివృద్ధి, సంక్షేమం కొరకు కృషి చేస్తున్న కృషీవలుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారాస పార్టీ అధ్యక్షుడు  కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ సమావేశంలో సుమారు 18 తీర్మాణాలు ప్రవేశ పెట్టిన భారాస పార్టీ  నాయకులు, వాటిని బలపర్చిన ప్రజా ప్రతినిధులు, నాయకులు తీర్మాన పత్రాలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అందించారు. వాటిని ఈ నెల 27న  నిర్వహించే భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయనున్న ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి తీర్మాణ పత్రాలను అందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మునిసిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు, జడ్పిటిసిలు సాగర్,  తిరుపతిరెడ్డి, సదయ్య, విజయ, ఎంపీపీ వినోద, ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.