గెల గీయలే.. కల్లు తీయలే..

గెల గీయలే.. కల్లు తీయలే..
  • మూడు రోజులుగా వీడని ముసురు..
  • తాటి చెట్లకు మోకు పెట్టని గీతా కార్మికులు..
  • ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: వానకాలం గీతా కార్మికులకు కష్టకాలంగా మారింది. మూడు రోజులుగా ముసురు వీడకపోవడంతో గీత కార్మికులు తాటిచెట్లకు మోకు పెట్టలేదు. తాటి గెలలను గీయలేదు. కల్లు తీయలేదు. వరుసగా మూడు రోజులపాటు గేలలు గీయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులపాటు గేలలు గీయకపోతే ఎండిపోయి కల్లు పారవు. ఇంకా నాలుగు నెలల పాటు కల్లు పారే గెలలు ఎండిపోతే తమ పరిస్థితి ఏంటని గీతా కార్మికులు ఆవేదన చెందుతున్నారు. తాటి చెట్లపై ఆధారపడి జీవిస్తున్న తమకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కష్ట నష్టాలను తెచ్చి పెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన గీత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని బాధిత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

వర్షాకాలం గీత కార్మికులకు కష్టకాలం..

 వర్షాకాలం గీత కార్మికులకు కష్ట కాలంగా చెప్పుకుంటారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూట తాటి చెట్లు ఎక్కి గెల గీస్తేనే కల్లు పారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాకాలం వచ్చిందంటే గీత కార్మికులకు భయంతో గడుపుతారు. వర్షం కురిసి తాటి చెట్లు తడిసిపోతే మోకు పెట్టలేరు, చెట్టు ఎక్కలేరు. వర్షాలు పడి తిరిగి గెరువయితే తడిచిన తాటి చెట్లు ఆరుతాయి. అప్పుడు గీత కార్మికులు చెట్లను ఎక్కుతారు. అయితే గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తడిసిన తాటి చెట్లు ఆరకపోవడంతో చెట్లు ఎక్కే పరిస్థితి లేదు. ఒకవేళ తడిచిన తాటి చెట్టు ఎక్కిన ఎక్కడ జారిపడిపోతామోననే భయం గీత కార్మికుల్లో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాడిచెట్టు ఎక్కలేక, గెలలు గీయలేక ఎండిపోతాయి. డిసెంబర్ వరకు కల్లుపారే పండు తాడు చెట్లు ముసుర్ల కారణంగా వాటి గెలలు గీయక  ఇప్పుడే ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని బాధిత కార్మీకులు చెబుతున్నారు.

తడిసిన తాడిచెట్టు ఎక్కడమంటే ప్రాణాలకు తెగించడమే..

 తడిసిన తాడిచెట్టు ఎక్కడమంటే గీత కార్మికులు ప్రాణాలకు తెగించడమేనని స్థానికులు చెబుతున్నారు. తాడిచెట్టు తడిస్తే ఎప్పుడు కాలుజారుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. పొడిగా ఉన్న తాడిచెట్టు ఎక్కినంత ఈజీగా తడిసిన చెట్టు ఉండదు. కాలు జారిందంటే పట్టు తప్పి కింద పడిపోవడమే జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తడిసిన తాడిచెట్లు ఎక్కేందుకు గీత కార్మికులు సాహసించరు. గెలగీయకపోతే ఎండిపోతుందని ఆవేదనతో కొంతమంది గుండె ధైర్యంతో ఎక్కాలని చూసినా, అది అందరికీ సాధ్యపడదు. అలా ధైర్యం చేసి చెట్టు ఎక్కి జారిపడి గీతాకార్మీకులు ప్రాణాలు విడిచిన సంఘటనలు అనేకం జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాటి చెట్టు ఎక్కలేక, గీతా కార్మికులు చేతులారా తమ జీవనాధారాన్ని కోల్పోవాల్సి వస్తుంది.