రామోజీ మృతి తీరని లోటు...

రామోజీ మృతి తీరని లోటు...
  • రామోజీ రావుకు పలువురు నివాళులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మృతి పత్రికా, వ్యాపార రంగాలకు తీరని లోటని, ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పించారని పలువురు ప్రముఖులు కొనియాడారు.

రామోజీ మృతి దిగ్భ్రాంతికరం...బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

రామోజీ రావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని, ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రామోజీ రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.స్వయం కృషితో ఎదిగిన గొప్ప దార్శనికుడని రామోజీ రావును కొనియాడారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.

అక్షర యోధుడు రామోజీ...మాజీ మంత్రి అల్లోల సంతాపం

రామోజీరావు మృతిపై  మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  సంతాపం వ్యక్తం చేశారు. అక్షరయోధుడు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రామోజీరావు కుటుంబానికి  ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  రంగం ఏదైనా విలువలు, నాణ్యతకు పెద్ద పీట వేశారని అన్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అద్భుత  విజయాలు సాధించిన రామోజీరావు మరణం  మీడియా రంగానికి, యావత్ తెలుగు జాతికి తీరని లోటని పేర్కొన్నారు.

నిబద్ధత కు ప్రతీక రామోజీ రావు...డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు

రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు మృతి పట్ల నిర్మల్ కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు , కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షుడి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సేవలను స్మరించుకుంటు సంతాపం వ్యక్తం చేశారు. రామోజీ కుంటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.రామోజీ రావు పలు రంగాల్లో ఎంతో మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. ఆయన శ్రమ, తపన, నిబద్ధత, క్రమ శిక్షణ కల్గిన మంచి వ్యక్తి అని సుగుణక్క పేర్కొన్నారు.