కంటి వెలుగు పరీక్షలు పెంచండి- శిబిరం ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ రాజర్షి షా

కంటి వెలుగు పరీక్షలు పెంచండి- శిబిరం ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి,మెదక్: కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా రోజు వారి నిర్వహించే పరీక్షల సరాసరి పెంచాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. 

గురువారం స్థానిక 29వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇట్టి శిబిరాలలో ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్ల అద్దాలను ఉచితంగా అందజేస్తారని, కంటి ఆపరేషన్ సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ సరాసరి రోజు 150 మంది శిబిరాలకు వచ్చే విధంగా ప్రజలలో అవగాహన కలిగించాలని వైద్యాధికారులకు సూచించారు. కంటి పరీక్ష చేసుకుంటున్న వారిని పలకరిస్తూ అద్దాలు నాణ్యతగా ఉన్నాయా, అద్దాలు పెట్టుకుంటే బాగున్నాయా, వైద్యులు బాగా చూస్తున్నారా అని ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ 38 రోజుల పాటు నుండి నిర్వహిస్తున్న ఈ కంటి వెలుగు శిబిరాలలో ఇప్పటి వరకు జిల్లాలో 40 బృందాల ద్వారా 232 గ్రామా పంచాయతీలు, 43 వార్డులు కవర్ చేసి 2,29,733 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 27,258 రీడింగ్ అద్దాలను,13,632 ప్రిస్క్రిప్షన్ అద్దాలను అందజేశామన్నారు. మరో 13,401 ప్రిస్క్రిప్టిషన్ అద్దాలకు ఆర్డర్ ఇచ్చామని, త్వరలో వాటిని అందజేస్తామన్నారు.    

 ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ జానకి రామ్ సాగర్, తహసిద్దార్ శ్రీనివాస్, డాక్టర్ నవీన్, మణికంఠ, కౌన్సిలర్ బొందుల రుక్మిణి, కృష్ణ, క్యాంప్ ఆఫీసర్ దేశాయి పవన్ కుమార్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.