దశాబ్ద కాలంలోనే శతాబ్దపు కీర్తిని సాధించాం

దశాబ్ద కాలంలోనే శతాబ్దపు కీర్తిని సాధించాం
  • సిద్దిపేట ప్రజల ప్రధాన మూడు కోరికలు తీరుస్తున్నాం.
  • జిల్లావాసి సీఎం కావడం మనందరికీ గర్వకారణం
  • రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీష్ రావు ఉద్ఘటన


సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సిద్దిపేట జిల్లా వాసి ఉండడం ప్రజలందరికీ గర్వకారణమని ఆర్థిక రాష్ట్ర వైద్య  ఆరోగ్య, శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక దశాబ్ద కాలంలోనే శతాబ్దానికి సరిపడా ఘన కీర్తిని సాధించామని మంత్రి గర్వంగా చెప్పారు. జిల్లా ప్రజల ప్రధాన కోరికలు మూడింటిని కెసిఆర్ ప్రభుత్వం నెరవేర్చుతున్నదని ఆయన కొనియాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం నాడు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన సభలో మంత్రి హరీష్ రావు పాల్గొని 14 పేజీల జిల్లా ప్రగతి నివేదికను ప్రజల ముందు ఉంచారు. రాష్ట్రం ఆవిర్భవించాక కొత్త జిల్లాల ఏర్పాటులో సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేయడంతో ప్రజల మొదటి కొరక నెరవేరిందన్నారు. తాగు,సాగునీటి అవసరాల కోసం కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల జిల్లా ప్రజలకు నీరు అందిందని తెలిపారు.

ఇక మూడో కోరిక సిద్దిపేటకు రైలు కాగా ఆ కోరికను వచ్చే ఆగస్టు నాటికి నిజం చేస్తున్నామని మంత్రి హరీష్ రావు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సిద్దిపేట బిడ్డ కెసిఆర్ ఉండడం వల్లే ఈ మూడు కోరికలు సహకారం అయ్యాయని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన పదేళ్లలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామని మంత్రి వివరించారు.అందుకే ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అదనపు కలెక్టర్లు ముజామిల్ ఖాన్, శ్రీనివాసరెడ్డి, ట్రేని కలెక్టర్ ఫైజాన్ అహ్మద్,పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డి  జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, హుస్నాబాద్ శాసనసభ్యుడు ఒడి తల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, మున్సిపల్ చైర్ పర్సన్ లు, రైతుబంధు అధ్యక్షులు, ఆత్మ కమిటీ అధ్యక్షులు, సుడా చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు,జిల్లా స్థాయి అధికారులు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అమరవీరుల కుటుంబాలకు సన్మానం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన సభలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానం చేసిన వారి కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను మంత్రి హరీష్ రావు తిలకించారు. అనంతరం వారితో వేదిక పైన గ్రూప్ ఫోటోలు దిగారు. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.