అంగరంగ వైభవంగా చెంచుల ఆడపడుచు భౌరమ్మ కళ్యాణం

అంగరంగ వైభవంగా చెంచుల ఆడపడుచు భౌరమ్మ కళ్యాణం
  • పెళ్లి పెద్దలుగా ఎమ్మెల్యే దంపతులు
  • భక్తులతో కిటకిటలాడిన భౌరాపూర్

నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిధి: శివరాత్రి పర్వదినాన ఆదివాసీల ఆరాధ్య దైవం మల్లికార్జున స్వామి, చెంచుల ఆడపడుచు అయిన భౌరమ్మ కల్యాణాన్ని శనివారం భౌరాపూర్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మాయి తరపున పెళ్లి పెద్దలుగా అచ్చంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు,వారి సతీమణి అమల వ్యవహరించగా స్వామి వారి తరపున చెంచు పెద్ద శంకరయ్య, వారి సతీమణి రామేశ్వరి పెళ్లి పెద్దలుగా పాల్గొన్నారు. అనాదిగా వస్తున్న చెంచుల ఆచారాలను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల పరిధిలోని అటవి ప్రాంతం అయిన భౌరాపూర్ లో మల్లికార్జున స్వామి భౌరమ్మ  కల్యాణాన్ని వైభవంగా జరిపించడం జరుగుతుంది.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి చెంచు ప్రజలు సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి రోజున భౌరాపూర్ లో జరిగే ఈ వేడుకను చూడటానికి తండోపతండాలుగా తరలివస్తారు.

ఈ సారి సైతం రాష్ట్రంలోని నలుమూలల నుండి చెంచులతో పాటు ఇతరులు స్వామి వారి కల్యాణ మహోత్సవ వేడుకను తిలకించడానికి తరలి వచ్చారు.భౌరాపూర్ అటవి ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. ఈ వేడుకను అధికారులు, చెంచులు కలిసి  అత్యంత భక్తిశ్రద్ధలతో మల్లికార్జున భ్రమరాంబిక కల్యాణాన్ని జరిపించారు.ఉదయాన్నే చెంచు గిరిజన మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపు చేయగా ఆడమగ  తేడా లేకుండా  డప్పుళ్ల మధ్య సాంప్రదాయ నృత్యాలు చేస్తూ అత్యంత సంతోషం,  భక్తి శ్రద్ధలతో మల్లికార్జున స్వామి, భౌరమ్మ విగ్రహాల ఊరేగింపు చేస్తూ  ఎదుర్కోళ్లు జరిపించారు.

మంచం ముగ్గులు పోసి ఇరువర్గాల గోత్రం వారు స్వామి వారిని, అమ్మవారి వివాహ సమ్మతం అడిగి ఏకాభిప్రాయం తెలుపగా జీలకర్ర బెల్లం పెట్టి  తలంబ్రాలు పోసి డప్పు చప్పుళ్లు, తప్పెట్ల  మధ్య వైభవంగా వివాహం జరిపించారు.ఈ సందర్భంగా స్వామి వారి తరపున చెంచు పెద్దలు అమ్మాయి నుండి కట్నకానుకలు అడిగారు. చెంచులకు ఆదివాసీల భవన్ మంజూరు చేయాలని,కృష్ణా నదిలో చేపలు పట్టుకునేందుకు అవకాశం కల్పించాలని, ఎస్.టి. రిజర్వేషన్లలో ఇతరులను చేర్చవద్దని కోరారు. జాతర కు వచ్చే భక్తులు నుండి అటవీ శాఖ వారు అధికంగా టోల్ వసూలు చేస్తున్నారని తద్వారా జాతరకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోతుందన్నారు.ఉమా మహేశ్వరం, మద్దిమడుగు దేవాలయాలు ఆదివాసీ క్షేత్రంలో ఉన్నందున ఆదివాసీలకు ట్రస్ట్ కమిటి లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.

శ్రీశైలం లో చెంచు సత్రం ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. అమ్మాయి తరపున పెళ్లి పెద్దగా  వ్యవహరించిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అబ్బాయి తరపున అడిగిన డిమాండ్లలో 90 శాతం డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు.ఈ కళ్యాణ వేడుకలో డి.టి.డి.ఓ అనిల్ ప్రకాష్, కొండనాగుల  సర్పంచు రేవతి, సార్లపల్లి సర్పంచ్ మల్లికార్జున్, తోకల బాల గురువయ్య, మల్లయ్య,  చెంచు సంఘాల పెద్దలు నిమ్మల శ్రీను,  డి.డబ్ల్యూ.ఓ వెంకటలక్ష్మి, డి.ఆర్.డి.ఓ నర్సింగ్ రావు, డి.పి.ఆర్.ఓ సీతారాం, డిఎస్పీ కృష్ణ కిషోర్, ఆర్.డి.ఓ పాండు నాయక్, లింగాల తహసిల్దార్ మునిరుద్దీన్, నలుమూలల నుండి వచ్చిన చెంచు ఆదివాసీ భక్తులు పాల్గొన్నారు.