పంట పొలాల్లో కొయ్య కాళ్లకు నిప్పు పెట్టిన దృశ్యం

పంట పొలాల్లో కొయ్య కాళ్లకు నిప్పు పెట్టిన దృశ్యం
  • పంట పొలాల్లో కొయ్య కాళ్లకు నిప్పు పెట్టిన రైతులు.. 
  • కాలిపోతున్న విద్యుత్ వైర్లు, మోటర్లు.. ఇండ్లపై పడుతున్న నల్లటి దుమ్ము... 
  • పంట పొలాలకు నష్టం అంటున్న వ్యవసాయ అధికారులు..

హుజూర్ నగర్ ముద్ర: రైతులకు సరైన అవగాహన లేకపోవడం వ్యవసాయ అధికారులు రైతాంగాన్ని చైతన్యవంతం చేయకపోవడం వల్ల పంట పొలాలు కోసిన అనంతరం కొయ్య కాళ్లకు నిప్పు పెట్టి గడ్డిని తగలబెడుతున్న సంఘటనలు ఆయకట్టు ప్రాంతంలో అనేకం చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా యాసంగి పంట వచ్చిన తర్వాత రైతులు కొయ్య కాళ్ళను ఎక్కువగా తగలబెడుతున్నారు. దీనివల్ల రైతాంగం నష్టపోవటమే కాక భూసారం కూడా తగ్గిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతులు కొయ్య కాళ్లకు నిప్పు పెట్టడం వల్ల పక్క పొలాలకు కూడా ఆ మంటలు వ్యాపించి ఆ రైతు పొలంలోని విద్యుత్ వైర్లు మోటార్లు మంచినీటి పైపులు తగలబడి పోతున్న పరిస్థితులు అనేకం జరుగుతున్నాయి. నిప్పు ఎవరు పెట్టారో కూడా తెలియని పరిస్థితిలో రైతులు నష్టపోతున్నారు. పట్టణానికి, గ్రామానికి దగ్గరగా ఉన్న పొలాల్లో నిప్పు పెట్టడం వల్ల కాలిపోయిన గడ్డి బూడిద పరిసర ప్రాంత ఇండ్ల మీద పడటం ఇంట్లోనే వస్తువుల మీద పడటంతో ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలు తగులు పెట్టడం వల్ల భూసారం తగ్గుతుందని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. భూమిలో ఉన్న సూక్ష్మజీవులు పంట పొలాలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు నశించిపోతాయని వ్యవసాయ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అనేక మంది రైతులు అవగాహన లేక ఇలాంటి పనులు చేస్తున్నారని పలువు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్ద పెద్ద గడ్డివాములు కూడా దీనివల్ల తగలబడి పోతున్నాయి. అధికారులు రైతాంగాన్ని చైతన్యవంతం చేసి దీనివల్ల జరిగే నష్టాన్ని రైతులకు వివరించాలని పలువురు కోరుతున్నారు. ఇటీవల వడగడుపులు పెరిగిపోవటంతో పంట పొలాల్లో ఉన్న కాలిన గడ్డి మొత్తం గ్రామాలపైనే ఉంటుందని పలువురు తెలిపారు .అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు గ్రామాల్లో మైకుల ద్వారా ప్రచారం నిర్వహించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.