BIG BREAKING: కడప ఎంపీగా షర్మిలను గెలిపించండి

విజయమ్మ వీడియో కలకలం   

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన తల్లి విజయమ్మ బిగ్ షాక్ ఇచ్చారు. తన కుమార్తె షర్మిలను కదప ఎంపీగా గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు.

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ మద్దతు ఎవరికి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికా లేదా గారాలపట్టి, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకా అన్న విషయం ఎట్టకేలకు తేటతెల్లమైంది. కడప ఎంపీగా పోటీ చేస్తున్న తన కుమార్తె వైఎస్ షర్మిలకే ఓటేసి గెలిపించాలని ఆమె కడప జిల్లా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఒక వీడియో ట్విటర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఆమె ఏమన్నారంటే... నేను విజయమ్మను, రాజశేఖర రెడ్డిగారిని అభిమానించే వారికి రాజశేఖరెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్ సభ పరిధిలోని ప్రజలందరికీ నా విజ్ఞప్తి. రాజశేఖర రెడ్డిగారిని ఏవిధంగా మీరు అభిమానించారో... ఏవిధంగా అక్కున చేర్చుకున్నారో.. ఏవిధంగా నిలుబెట్టుకున్నరో... ఆయన కూడా ఊపిరి వున్నంత వరకు ప్రజాసేవలో మీ అందరికీ, మీకే అంకితమయ్యారు. మీ సేవ చేస్తూనే ఆయన చనిపోయారు. ఈ రోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిల పార్లమెంట్ కు కంటెస్ట్ చేస్తూ ఉంది. ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంటుకు పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకు ఇవ్వమని అందర్నీ ప్రార్థిస్తున్నాను.  విజయమ్మ ఎక్స్ లో విడుదల చేసిన ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనమే రేపుతోంది.

కడప లోక్ సభ నియోజకవర్గంలో ప్రస్తుత ఎంపీ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న విషయం అందరికీ విదితమే. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి 2015 మార్చిలో తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో నిందితుడిగా వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ పేర్కొంది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో వుంది. కడప లోక్ సభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలతో పాటు, దివంగత వివేకానంద రెడ్డి కుమార్తె షర్మిల ఎన్నికల ప్రచారంలో వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ హత్య కేసులో నిందితుడిగా పేర్కొంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొద్ది రోజులుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వైఎస్ షర్మిల తన ఎన్నికల ప్రచారంలో ఘాటుగానే విమర్శించారు. తన కడుపున పుట్టిన కుమారుడు, కుమార్తెల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకోవడం, ఇరువురు వేర్వేరు పార్టీలకు సారథ్యం వహిస్తూ తలపడనున్న వేళ, ఎన్నికల వేడి రాష్ట్రంలో మొదలవక ముందే వైఎస్ విజయలక్ష్మి విదేశాలకు పయనమయ్యారు. అంతకుముందు అభ్యర్థుల జాబితాను విడుదల చేసే సమయంలో ఆమె కుమారుడు జగన్ కు మద్దతుగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేశారు. అలాగే కుమార్తె షర్మిలతో కూడా కలిసి వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేంతలో ఎవరికీ మద్దతుగా ప్రచారం చేయకుండానే ఆమె విదేశాలకు వెళ్లిపోయారు. ఆమె ఎవరికి మద్దతు పలుకుతారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. తీరా ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ తన కుమార్తె షర్మిలను ఎంపీగా గెలిపించాలంటూ ఆమె చేసిన వీడియో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలలో సంచలనమే కానుంది.