కాంగ్రెస్ తో  కామ్రేడ్లు?

కాంగ్రెస్ తో  కామ్రేడ్లు?
  • బీఆర్ఎస్ తో పొత్తు కుదరకపోవడంతో హస్తం వైపు చూపు!
  • ఢిల్లీ నుంచే ప్రతిపాదనలు
  • ఇప్పటికే ‘ఇండియా’ టీంలో కమ్యూనిస్టులు
  • సీఎం మిత్ర ధర్మం పాటించలేదన్న కూనంనేని
  • కేసీఆర్​నిర్ణయాన్ని ఊహించలేదన్న తమ్మినేని
  • శక్తికి మించి కష్టపడి సత్తా చూపిస్తామన్న వామపక్షాలు
  • బీజేపీతో సీఎంకు దోస్తీ-.. అందుకే మోసం చేశారని విమర్శలు
  • ఆగస్టు 27న మరోసారి కమ్యూనిస్టుల భేటీ 


ముఖ్యమంత్రి కేసీఆర్​వామపక్షాలకు అవకాశం ఇవ్వకుండా 115 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో కామ్రేడ్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తమతో పొత్తుకు బీఆర్ఎస్ సుముఖంగా లేకపోవడంతో సీపీఐ, సీపీఎం నేతలు మంగళవారం మగ్ధుం భవన్ లో భవిష్యత్ కార్యచరణపై సమావేశం నిర్వహించాయి. అసెంబ్లీ ఎన్నిక్లలో శక్తికి మించి కష్టపడి తమ సత్తా ఏంటో చూపిస్తామని ఈ సందర్భంగా కామ్రేడ్లు స్పష్టం చేశారు.  కాంగ్రెస్ తో జతకట్టి పోటీ చేయాలని, లేకపోతే బలంగా ఉన్నచోట్ల ఒంటరిగా బరిలోకి దిగాలని వామపక్షాలు భావిస్తున్నాయి. కాగా బీఆర్ఎస్ తో పొత్తు కుదరకపోవడంతో కేసీఆర్ ను వ్యక్తిగతంగా దూషించబోమని, విధానపరంగా తేల్చుకుంటామని వామపక్ష నేతలు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. 

ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్​తో పొత్తు కుదరకపోవడంతో వామపక్షాలు భవిష్యత్​కార్యాచరణపై దృష్టి పెట్టాయి. కుదిరితే ఒంటరిగా.. లేకపోతే కాంగ్రెస్​తో జట్టుకట్టి తమ సత్తా ఏంటో చూపించాలని యోచిస్తున్నట్లు సమాచారం. వామపక్షాలు ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నాయి. తెలంగాణ విషయానికి వచ్చే సరికి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నిన్నమొన్నటి వరకు బీఆర్ఎస్ తో కలిసి పనిచేశాయి. 

  • మునుగోడులో గెలిపించిన వామపక్షాలు..

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా నిలిచి గెలిపించాయి. అయితే సీఎం కేసీఆర్ అవసరానికి తమను వాడుకుని ఇప్పుడు వదిలేశారనే అభిప్రాయంలో ఉన్న వామపక్ష నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నాయి. వాస్తవానికి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ నాలుగు చోట్ల సీపీఎం ఆరు చోట్ల సీట్లను కేటాయించాలని బీఆర్ఎస్ ను కోరాయి. కానీ కేసీఆర్ వారికి అవకాశం ఇవ్వకుండా 115 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి గట్టి షాక్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ పై కసి తీర్చుకోవాలనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తో జతకట్టేందుకు వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో పొత్తుల కోసం ఢిల్లీ స్థాయి నుంచి వ్యవహారాన్ని నడుపుతున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఈనెల 27వ తేదీన సీపీఐ, సీపీఎంలు మరోసారి సమావేశం కానున్నాయి. 

  • బీజేపీని ఓడించేందుకు కలిసి పని చేస్తాం..

ఇన్నాళ్లు తమతో జతకట్టిన సీఎం కేసీఆర్ కనీసం మిత్రధర్మం పాటించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం అంటేనే మోసం అనే నిర్వచనం కేసీఆర్ ఇస్తున్నారని దుయ్యబట్టారు. తమతో విభేదించడం వలన తీవ్రంగా నష్టపోయేది కేసీఆర్ మాత్రమేనని.. తాము కాదన్నారు. ఎటువంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఉభయ వామపక్ష పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని అన్నారు. బీజేపీని ఓడించేందుకు వామపక్షాలు కలిసే పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. వామపక్షాలు లేకపోతే మునుగోడులో బీఆర్ఎస్ ఏమయ్యేదని ప్రశ్నించారు. బీజేపీ అండదండలు ఉంటే చాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారా ? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రమాదకరమైన పార్టీయా కాదా అనే విషయంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కూనంనేని డిమాండ్ చేశారు. బీజేపీతో కేసీఆర్ కు సఖ్యత ఏర్పడిందని ఆరోపించారు. బీజేపీతో ఇప్పుడు మిత్రత్వం కావల్సివచ్చిందా? అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించారు- : తమ్మినేని వీరభద్రం

అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పనిచేస్తామని పదేపదే చెప్పిన సీఎం కేసీఆర్ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. కేసీఆర్ రాజకీయ వైఖరిలో తేడా వచ్చిందని విమర్శించారు. కేసీఆర్ నిర్ణయాన్ని తాము ఊహించలేదన్నారు. సీట్లు సర్దుబాటు అనేది పెద్ద సమస్య కాదని , కేసీఆర్ రాజకీయ వైఖరిలో తేడా వచ్చిందని ఆయన విమర్శించారు. మునుగోడు ఎన్నికలో కేసీఆరే తమతో పొత్తు కోరారని, ఎన్నికలు అయిన తర్వాత కూడా కమ్యూనిస్టులు తమ మిత్రులుగా కేసీఆర్ చెప్పుకొచ్చారని అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలనేది తమ పార్టీ నిర్ణయమని, ఆ పార్టీతో వ్యతిరేక వైఖరి వలనే ఇండియా కూటమితో ఉన్నామని తమ్మినేని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో కొట్లాడుతుంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో ఎలా పనిచేస్తారని బీఆర్ఎస్ నేతలు తమని అడిగారని ఆయన గుర్తు చేశారు. ఇండియా కూటమితో దగ్గరగా ఉన్నామనే ఉద్దేశంతో కేసీఆర్ పొత్తు వద్దనుకుంటున్నారేమో అని తమ్మినేని అన్నారు.