రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
  • అంబరాన్నంటిన విమోచన సంబరాలు 
  • పరేడ్​ గ్రౌండ్​లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అమిత్​ షా
  • పబ్లిక్​ గార్డెన్ లో సమైక్యత దినోత్సవంలో పాల్గొన్న కేసీఆర్​ 
  • గాంధీభవన్​ లో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ విమోచన దినోత్సవ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ లో ప్రధాన పార్టీలైన బీఆర్​ఎస్, కాంగ్రెస్, బీజేపీల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. సెప్టెంబర్​ 17న.. సమైక్యత దినంగా ప్రకటించిన బీఆర్ఎస్​ పబ్లిక్​ గ్రౌండ్ లో ఉత్సవాలు నిర్వహించింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్​ విమోచన దినోత్సవ  ప్రాముఖ్య తతోపాటు తొమ్మిదేళ్ల బీఆర్ఎస్​ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. అంతకు ముందు గన్​ పార్కులో తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. తెలంగాణ భవన్​లో బీఆర్​ఎస్​ ప్రధాన కార్యదర్శి, లోక్​సభాపక్ష నేత కె.కేశవరావు జెండావిష్కరణ చేశారు. బీజేపీ, కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పరేడ్​ గ్రౌండ్​ లో జరిగిన వేడుకల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్​ కిషన్​ రెడ్డి పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్​ ఆధ్వర్యంలో తెలంగాణ విలీన వేడుకలు గాంధీభవన్​ లో జరిగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, నాయకులు కోదండరెడ్డితో కలిసి గాంధీభవన్​లో జెండాను ఆవిష్కరించారు.

రాష్ట్ర సాధనతో నా జన్మ సార్ధకమైంది : సీఎం కేసీఆర్​
తెలంగాణ సాధనతోనే తన జన్మ సార్ధకమైందని సీఎం కేసీఆర్​ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైన తెలంగాణలో స్వపరిపాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నామన్నారు. గత తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు. ‘హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో అంతర్భాగంగా మారిన ఈ సందర్భాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవడం సముచితంగా భావించింది తెలంగాణ ప్రభుత్వం. అందుకే, ఈరోజున రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ నేలపై పలు సందర్భాలలో అనేక పోరాటాలు జరిగాయ’ ని ఆయన చెప్పారు. న్యాయం, ధర్మం, రాజ్యాంగ హక్కుల సాధన కోసం ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి, గుండెలు ఎదురొడ్డి తెలంగాణ నిలిచిందని చెప్పారు. దొడ్డి కొమురయ్య నుండి చాకలి ఐలమ్మ దాకా, కొమురంభీం నుండి రావి నారాయణరెడ్డి దాకా, షోయబ్ ఉల్లాఖాన్ నుండి సురవరం ప్రతాపరెడ్డి దాకా, స్వామి రామానందతీర్థ నుండి జమలాపురం కేశవరావు దాకా, బండి యాదగిరి నుండి సుద్దాల హనుమంతు, కాళోజీ నుండి, దాశరథుల దాకా ఎందరెందరో వీరయోధులూ త్యాగధనులు,  చిరస్మరణీయులైన  వారందరికీ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.

విమోచనంలో రాజకీయం: అమిత్​ షా
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విమోచన  దినోత్సవాన్ని అధికారికంగా  నిర్వహించలేదని బీఆర్​ఎస్​ పై మండిపడ్డారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ విమోచనంపై రాజకీయం చేసేవారిని ప్రజలు క్షమించరని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాకా, హైదరాబాద్‌ను 399 రోజులు పాలించిన నిజాం ఇక్కడి ప్రజలను ఇబ్బందిపెట్టారన్నారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సర్దార్ పటేల్ 400వ రోజున హైదరాబాద్​ కు  విముక్తి కల్పించారని గుర్తుచేశారు. ఈ ఉద్యమంలో అనేక సంస్థలు పోరాడాయని చెప్పారు. పటేల్, మున్షీ వల్లే నిజాం పాలన అంతమైందని షా అన్నారు. అనంతరం అమిత్ షా దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. షోయబ్ ఉల్లాఖాన్ స్మారక, రామ్‌జీ గొండు స్మారక ప్రత్యేక పోస్టర్ కవర్‌లను విడుదల చేశారు. ‘హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొన్న వీరులకు అమిత్​ షా నివాళులర్పించారు.

కాంగ్రెస్​తోనే.. విలీనం, తెలంగాణ ఏర్పాటు : మహేశ్ గౌడ్​
నాడు దేశంలో హైదరాబాద్ ను విలీనం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఈ రెండు కాంగ్రెస్​ తోనే సాధ్యమయ్యాయని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​మహేశ్​గౌడ్​ చెప్పారు. ఆపరేషన్ పోలో ద్వారా ఇక్కడ ప్రజల కోరిక మేరకు అప్పటి ప్రధాని నెహ్రు, హోమ్ మంత్రి పటేల్ లు హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైనా.. ఉద్యమ ఆకాంక్షలు మాత్రం నెరవేరడం లేదన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు 6 లక్షల కోట్ల అప్పులకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్​ కుటుంబం భోగాలు అనుభవిస్తుంటే, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామన్న కేసీఆర్ ఎవరికి భయపడి చేయడం లేదని ప్రశ్నించారు.